ఎస్‌ఆర్ నగర్ పిఎస్‌లో విధుల నిర్వహణ
హైదరాబాద్ : కరోనా సోకడంతో చికిత్స పొందుతూ హోంగార్డు మృతిచెందిన సంఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్‌రెడ్డి(43)కి కొంత కాలం క్రితం కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సుధాకర్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. హోంగార్డు సుధాకర్ రెడ్డి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కోవిడ్‌తో మృతిచెందాడు.
పోలీసులకు మళ్లీ కరోనా దడ..
నగర పోలీసులు మళ్లీ కరోనా సోకుతుందేమోనని బయపడుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వరసుగా ధర్నాలు, రాస్తారోకోలు, బోనాలు నిర్వహించడంతో పోలీసులకు బందోబస్తు విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే చాలామంది ప్రజలు మాస్కులు పెట్టుకోకుండానే బయట తిరుగుతున్నారు. వారి ద్వారా పోలీసులకు కరోనా సోకుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా పోలీసులు కరోనా పాజిటివ్ వస్తోంది. పదుల సంఖ్యలో అధికారులు, కింది స్థాయి సిబ్బంది కరోనా బారినపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత మంది పోలీసులు కరోనా బారినపడవచ్చని మిగతా వారు ఆందోళన చెందుతున్నారు.