ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని సూచించింది. అందుకు విరుద్దంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్.కె.జి నుంచే పిల్లల సామర్ధ్యానికి మించి హోంవర్క్ ఇస్తున్నారు. ఒకటి నుంచి మూడు వరకు అదనంగా మరో 5 సబ్జక్టులను కూడా విద్యార్ధులకు బోధిస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బోధనేతర పనుల వల్ల బోధనకు ఆటంకం కలుగుతుండగా,మరోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో క్రమశిక్షణ పేరుతో ఇచ్చిన హోంవర్క్ చేయలేదని, ఇంగ్లీష్ లో సరిగ్గామాట్లాడంలేదని,బెల్టు పెట్టుకోలేదని, బూట్లు ధరించలేదని, టై లేదనే కారణాలతో పిల్లల్ని దండిస్తున్నారు, తీవ్రంగా దూషి స్తున్నారు. ప్రాథమిక విద్యకు సంబంధించి ఏ రెండు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే రకమైన సిలబస్‌ని అమలు చేయడం లేదు.
అధిక పుస్తకాల బరువుతో పిల్లలకు వెన్నునొప్పి, మెడనొప్పులొస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో తరగతి గదుల్లో ఏ జరుగుతుందోనని సి.సి. కెమెరాల ద్వారా ఆయా యాజమాన్యాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారే గానీ, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని తీవ్రంగా దండించడం వల్ల వారి మనసులో ఎటువంటి మార్పులొస్తున్నాయోనని ఎవరూ గమనించడం లేదు.చైల్ లైన్ ఇండియా ఫౌండేషన్ నివేదిక ప్రకారం 1996లో కేవలం 2600మంది విద్యార్థులు మాత్రమే తమ సమస్యలను పరిష్కరించమని ఫిర్యాదు చేయగా, 2021నాటికి వీరి సంఖ్య 50లక్షలకు పైగా చేరుకుంది. అంతేకాకుండా వచ్చే ఫోన్ కాల్స్ లో ఎక్కువగా నిశ్శబ్ద ఫోన్‌కాల్స్ ఉంటున్నాయని, పిల్లలు ఫోన్‌చేసి కొద్ది నిమిషాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుంటున్నారని ఫౌండేషన్ నివేదిక స్పష్టంచేస్తుంది. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఇందులో ఎక్కువ ఫోన్‌కాల్స్ మధ్య, ఉన్నత తరగతి కుటుంబాల పిల్లల నుంచి వచ్చినవేనని ఫౌండేషన్ వెల్లడించింది. ఆ కుటుంబాల పిల్లలు తన తల్లి దండ్రులు వారి వారి వ్యక్తిగత వ్యవహారాలలో బిజీగా వుండటం వలన తమను సరిగ్గా పట్టించుకొనడం లేదని, తమకు గెడైన్స్ కావాలని చెప్తున్నారు.
నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం గతంతో పోల్చుకుంటే యేటా ఆత్మహత్యల శాతం పెరుగుతోంది.ఇందుకు కారణం ర్యాంకుల పేరుతో అదనపు ఒత్తిడి,ఆటలకు సరైన సమయం లేకపోవడం,చదివిన చదువుకు సరైన ఉపాధ అవకాశాలు లేకపోవడం, విద్యార్థుల మధ్య ఆనారోగ్యకరమైన పోటీ వంటివి చెప్పవచ్చు. అదే విధంగా విద్యాలయాలల్లో కౌన్సిలర్స్ కూడా ఉండటం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలానికొక కౌన్సిలర్ ని నియమిస్తామని తెలిపింది.పిల్లలపై ఒత్తిడి తగ్గాలంటే, వారికి కొంత హోమ్ వర్క్ భారం తగ్గాలి. ఆటలకు తగిన సమయం ఉండాలి.సిలబస్ భారం తగ్గించాలి.ఇంజనీరింగ్, మెడిసినే గాకుండా ఇతరత్రా కోర్సులలో విద్యనభ్యసించిన వారికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాల్సి ఉన్నది.అప్పుడే వారి భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.
యం. రాంప్రదీప్
9492712836