Monday, January 13, 2025

కులద్వేషంతో కిరాతకం

- Advertisement -
- Advertisement -

కులమత ద్వేషాలతో కొనసాగుతున్న సమాజంలో వేర్వేరు కులాలకు చెందిన యువత ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం బలిపీఠంగా తయారైంది. అటు ఇటు కుటుంబాల పెద్దలు తమ పరువు ప్రతిష్ఠలు గంగలో కలిసిపోయాయన్న ఉక్రోషంతో ఎంతకైనా తెగిస్తున్నారు. తమ కన్నపేగును, రక్తబంధాన్ని తెంచివేస్తున్నారు. కుల దురహంకార హత్యలను నివారించాలని సుప్రీం కోర్టు తీర్పుల ద్వారా హెచ్చరించినా సమాజంలోని కరడుకట్టిన సంప్రదాయ వర్గాలకు కనువిప్పు కావడం లేదు. దీనికి తాజా ఉదాహరణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన 27 ఏళ్ల కొంగర నాగమణిని అత్యంత పాశవికంగా హత్య చేయడమే. మానవ మేధస్సు శాస్త్రవిజ్ఞానంతో అద్భుతమైన ఆవిష్కరణలు రూపొందించగలుగుతున్నా ఇలాంటి కులదురహంకార హత్యలు జరుగుతుండడం మానవ సమాజానికే సిగ్గుచేటు.

ఈ హత్యలకు బలైపోతున్నవారు ప్రధానంగా దళితులు, మహిళలే. వీటిని పరువు హత్యలు, హానర్ కిల్లింగ్స్ అని పిలుస్తున్నారు. ఇవి ఒక విధంగా స్త్రీ స్వేచ్ఛను, హక్కులను ఉక్కుపాదంతో పురుషాధిక్య సమాజం తొక్కివేయడమే అవుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో తాజా నివేదిక ప్రకారం గత సంవత్సరం దాదాపు 25 పరువు హత్యల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 5000 మంది మహిళలు, బాలికలు పరువు కోరలకే బలైపోతున్నారు. వీరిలో దాదాపు మూడింట ఒకవంతు మంది భారత్, పాకిస్థాన్‌లకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా పరువు హత్యల సంఖ్య దాదాపు 20,000 వరకు ఉంటోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. జాట్‌ల వంటి అనేక వర్గాల్లో ఈ హత్యలను వీరోచిత చర్యలుగా పరిగణిస్తుండటం అత్యంత శోచనీయం. సామాజిక సరిహద్దులను అతిక్రమించడానికి సాహసించే వారిని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలు చివరకు పరువు హత్యలకు దారి తీస్తున్నాయని చాలా మంది ఆవేదన చెందుతున్నారు.

దేశంలో సంచలనం కలిగించిన మనోజ్ మరియు బాబ్లీ పరువు హత్య కేసును పరిశీలిస్తే వీరు ఐదుగురు పోలీస్ అధికారులతో కలిసి వచ్చినప్పటికీ బహిరంగంగా దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ సంఘటనలో మనోజ్ (బాధితురాలు) సోదరి తమ కుటుంబం మొత్తం ఏవిధంగా సామాజిక బహిష్కరణ, బెదిరింపులకు గురయ్యిందో ఒక టివి ఛానల్‌లో ఇచ్చిన ఇంటర్వూలో వివరించింది. అత్యాచారం చేస్తామని మనోజ్ సోదరికి బెదిరింపులు కూడా వచ్చాయి. తెలంగాణలోని మిర్యాలగూడలో అగ్రవర్ణ కుటుంబానికి చెందిన 21 ఏళ్ల అమృత, దళితుడైన 24 ఏళ్ల ప్రణయ్ తల్లిదండ్రులను ఎదిరించి 2016 లో వివాహం చేసుకున్నారు. అమృత కుటుంబీకులు దీనికి తట్టుకోలేక పోయారు. అమృత ఐదు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె నాన్నే ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు.

ఈ హత్యకు సంబంధించిన కుట్రలో అమృత తండ్రి మారుతీరావుతో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లతోపాటు మొత్తం ఆరుగురి జోక్యం ఉందని తేలింది. ఈ హత్యకు వారు దాదాపు కొన్ని లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్టు బయటపడిందంటే వారు ఎంతటి కులద్వేషులో తెలుస్తుంది. అనేక ప్రాంతాల్లో పరువు హత్యలు పెరగడంతో భయంతో పారిపోయిన కులాంతర జంటలను రక్షించడానికి, కొన్ని ప్రాంతాల్లో సురక్షిత గృహాలను ఏర్పాటు చేసినా అక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. వీరు బయట స్వేచ్ఛగా మసలాడే పరిస్థితి కలగడం లేదు. ఎక్కడకు వెళ్లినా, ఏ ఉద్యోగం చేసినా అక్కడకు కూడా కులద్వేష తోడేళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని సమాజాలలో పరువు హత్యలను తక్కువ తీవ్ర నేరాలుగా పరిగణిస్తున్నారు. బిబిసి ఆసియన్ నెట్‌వర్క్ చేసిన సర్వే ప్రకారం 500 మంది యువ సౌత్ ఆసియన్లలో పది మందిలో ఒకరు తమ కుటుంబ పరువుకు భంగం కలిగించే వ్యక్తిని హత్య చేస్తే తాము క్షమించబోమని చెప్పారు.

టర్కీ లోని కుర్దిష్ ప్రాంతమైన ఆగ్నేయ అనటోలియా ప్రాంతంలో పరువు హత్యకు సామాజిక కళంకానికి సంబంధం ఉందని 2008లో టర్కీస్ అధ్యయనంలో తేలింది. బాగా చదువుకున్న యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు కూడా పరువు హత్యల్లో నేరస్థులుగా ఉన్నట్టు అధ్యయనంలో బయటపడింది. బ్రిటన్ వంటి పాశ్చాత్య సంస్కృతుల్లో తలెత్తే పరువు హత్యలు వలస కుటుంబాలను నియంత్రించడానికి ఒక ఎత్తుగడగా ముస్లిం మ్యాగజైన్ ఎడిటర్ ఫరీనా ఆలం పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో లాహోర్‌లో పరువు హత్యలను మహిళల స్వేచ్ఛను హరించే కుట్ర అని, హంతకులు తాము చేసిన హత్యలకు గర్వపడుతుంటారని లాహోర్‌లోని పిర్కత్‌గా మహిళా వనరుల కేంద్రానికి చెందిన నిఘత్ తాపిక్ పేర్కొన్నారు. గిరిజన సమాజాల్లో ఈ హత్యలను నేరంగా పరిగణించకుండా హంతకులను రక్షిస్తుంటారని, పోలీస్‌లు ఈ కేసులను కప్పిపుచ్చుతుంటారని తెలియజేశారు.

పాకిస్థాన్‌లో మహిళలకు జీవించేహక్కు వారి సామాజిక నిబంధనలు, సంప్రదాయాలు పాటించడం పైనే ఆధారపడి ఉంటుందని వివరించారు. ఈ కట్టుబాట్ల విషయంలో నగరాలకు, గ్రామాలకు మధ్య తేడా కనిపిస్తుంది. గ్రామాల్లో అపరిచితులతో మహిళలను, బాలికలను మాట్లాడనీయరు. పెద్దలు ఈ వ్యవహారాలను నియంత్రిస్తుంటారు. కానీ నగరాల్లో ఒకరి కుటుంబ సభ్యులు వేరేవారితో కూర్చుని మాట్లాడినా లేదా పని చేసినా పెద్దలు దాన్ని అడ్డుకోరు. ఇప్పటి పద్ధతుల ప్రకారం అవన్నీ మామూలే అని సరిపెట్టుకుంటారు. కానీ కులద్వేషంతో కిరాతకంగా ప్రాణాలను బలిగొనే ఘోర సంస్కృతి ఎక్కడైనా దానిని నియంత్రించడానికి కఠినమైన శిక్షలు పడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News