‘తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతీ యువకులు వందలాది మంది ప్రతి సంవత్సరం దారుణ హత్యలకు గురవుతున్నారు. ఇది చాలా దారుణం. దుర్మార్గం. ఇవి కేవలం చట్టాలు, శాసనాల వల్ల ఆగిపోవు. దానికి సమాజంలో పరివర్తన జరగాలి” అంటూ ఇటీవల పదవీ విరమణ పొందిన చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తన అసక్తతను వ్యక్తపరిచారు. గత రెండు నెలల కాలంలోనే తెలంగాణలో రెండు పరువు హత్యలు జరిగాయి. ఒకరు సొంత చెల్లెలినే ఒక అన్న ఇబ్రహీంపట్నం సమీపంలో హత్య చేయగా, రెండోది నాలుగు రోజుల క్రితం సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి తాను వివాహం చేసుకున్న అమ్మాయి కుటుంబం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గత ఆరు నెలల క్రితం జహీరాబాద్ ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటన చేటుచేసుకున్నది. గత పదేళ్లలో 120 మందికి పైగా కులాంతర వివాహాల కారణంగా కుల దురహంకార హత్యలకు బలయ్యారని అనధికార లెక్కలు చెబుతున్నాయి.
గతంలో ఇటువంటి దారుణాలను మనం ఉత్తర భారతదేశం నుంచి వింటుండేవాళ్లం. ముఖ్యంగా హర్యానా కాప్ పంచాయతీల దుర్మార్గాలు కథకథలుగా ఉండేవి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఘోరాలు కనిపించేవి. వినిపించేవి. ఆ హత్యల పరంపర తెలంగాణకు కూడా పాకింది. ఇందుకు గల కారణాలను కొంత లోతుగా పరిశీలించాలి. వీటి మీద ఒక సమగ్రమైన అధ్యయనం జరగాలి. అయితే కులాంతర వివాహాలు సహించలేక జరుగుతున్న కుల దురహంకార హత్యలకు ప్రధాన కారణం కుల వ్యవస్థ. ముఖ్యంగా ఇప్పటికీ హిందూ వ్యవస్థలో, హిందూమతావలంబకులలో కులమనే ఒక దొంతరల, నిచ్చెనమెట్ల వ్యవస్థ మనుషులందరినీ ఒక్కటిగా జీవించడానికి అంగీకరించదు. అయితే ఈ మధ్యకాలంలో హిందూ మతమనగానే ఉలిక్కిపడే కొంత మంది వ్యక్తులు, సంస్థలు ఇటువంటి దారుణాల సమయంలో నోరు మెదపడం లేదు. గత రెండు నెలల కాలంలో జరిగిన ఘటనలపైన ఏ సంస్థలు స్పందించలేదు. ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, హిందూమతంలో కులాలు లేవని, అందరూ హిందువులేనని భాష్యం చెటుతుంటారు. కానీ ఇప్పటి వరకు కులాలను నిర్మూలించి, సంఘటితమైన ఒక మతాన్ని నిర్మించే బాధ్యతను ఏ హిందూ సంఘం కాని, నాయకులు గాని తీసుకోలేదు.
కుల వ్యవస్థ భౌతికమైన నిర్మాణం కాదు. ఇది మానసిక రోగం. నరనరాన కుల స్వభావం ప్రతికణంలో ఇమిడి ఉన్నది. ఇక్కడ మనుషులు లేరు. కులాల మనుషులు లేరు. ఇక్కడ హిందూ మతం లేదు కులాలు మాత్రమే ఉన్నాయి. ఈ కులాలు కూడా ఒక దాని మీద ఒకటి నిలబడి ఉంటాయి. తాను కింద ఒక మనిషిని తొక్కేస్తుంటాడు. పై కులం కాళ్లను భుజాల మీద మోస్తుంటాడు. ఇక్కడ ధనం, హోదా, భూమి కులం విషయంలో లెక్కలోకి రాదు. ఒకవేళ పైన ఉన్న కులం పేదరికంలో ఉన్నప్పటికీ ధనవంతులైన కింది వాళ్లతో కలిసి జీవించడానికి, పెళ్లిళ్లు చేసుకొని జీవితాలను పంచుకోవడానికి అంగీకరించరు. ఇక్కడ ఒక సామెతను గుర్తు చేసుకోవాలి. కూటికి పేదోళ్లం కావచ్చు, కానీ కులానికి పేదోళ్లం కాదు అనే ఈ సామెత ఎంత బలమైన వాక్యమో వేల ఏళ్లుగా రుజువవుతున్నది.
సూర్యాపేటలో జరిగిన సంఘటనలో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అందులో వడ్లకొండ కృష్ణ భార్య నాయనమ్మ ఈ హత్యలో కీలక సూత్రధారి అని పోలీసులు తేల్చివేశారు. తన మనవరాలు తక్కువ కులానికి చెందిన వాణ్ణి పెళ్లి చేసుకున్నందున ఆమె సహించలేకపోయింది. కృష్ణను చంపినోడికి తన ఆస్తిని ఇస్తానని చెప్పినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. అంటే ఒక వృద్ధురాలు కులమంటే ఎంత పరువుగా భావించిందో అర్థమవుతుంది. అందువల్ల ఆ కుటుంబమంతా ఏకమై కృష్ణను హత్య చేశారు. అది వాళ్లకు గర్వకారణం. చాలా గర్వంతో ఉంటారు వాళ్లు. గతంలో పెద్ద నేరస్థులు కాదు. హంతకులు అయి ఉండకపోవచ్చు. ఆ వృద్ధురాలు గతంలో సాయుధ ముఠాలను నడిపి ఉండే అవకాశం లేదు. కాని ఆ దారుణ హత్యను ఆ కుటుంబమంతా సంతోషంగా చేసింది. ఇది వాస్తవ చిత్రం. ఇది ఒక కుటుంబ దుర్మార్గమనుకుంటే పొరపాటే. ప్రధానమైన పాత్ర ఆ గ్రామ కులాల వ్యవస్థది. సొంత కులపోల్లు, పై కులపోల్లు ఏదైనా తగువు వస్తే , మీ పిల్ల ఆ ఎక్కువ కులపోన్ని చేసుకున్నదని, మీకేమీ పరువు ఉందని అనడం సర్వసాధారణంగా జరిగేదే. అంటే కుల వ్యవస్థను కుటుంబం, ఆ తర్వాత కులాల సమాహార నివాసమైన గ్రామం కారణం కాక తప్పదు. అందువల్లనే కాటికి కాలు చాపే ఒక వృద్ధురాలు కూడా పరువు కోసం ఆస్తిని, ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంటే అతిశయోక్తి కాదు.
తర్వాత మూడో బాధ్యత ప్రభుత్వాలది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు నిండాయి. సరిగ్గా అదే రోజు ఈ హత్య జరిగింది. ఒక రకంగా రాజ్యాంగం దాడికి గురైంది. ఆ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో వివక్షను, అణచివేతను రూపుమాపడానికి సమాన హక్కులు కల్పించడం మాత్రమే కాకుండా, అంటరానితనాన్ని నిర్మూలించే నిబంధనలను కూడా చేర్చుకున్నది. దాని కనుగుణంగానే కొన్ని చట్టాలను కూడా తీసుకొచ్చాం అందులో భాగంగానే ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం రూపొందించుకున్నాం. అందులో కాలానుగుణంగా చాలా సవరణలు, చేర్పులు, మార్పులు చేసుకున్నాం.
గతంలోని చట్టాల కన్నా ఈ చట్టం ప్రత్యేకమైనది. ఈ చట్టం నేరస్థులకు శిక్షలను ఖరారు చేయడం మాత్రమే కాకుండా, నేరాలు జరగకుండా నిరోధించే ప్రక్రియను, కార్యక్రమాన్ని ప్రతిపాదించింది.
ఎక్కడైతే ఎస్‌సి, ఎస్‌సిల మీద అత్యాచారాలు జరిగే అవకాశముందో, దాడులు జరిగే పరిస్థితులున్నాయో గమనించి వాటిని నిరోధించడానికి, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలన్నీ సమష్టిగా కృషి చేయడాలనేది అందులో పేర్కొన్న ప్రధాన అంశం. కులాంతర వివాహాల విషయంలో రెండు కుటుంబాలను, ఆ గ్రామ ప్రజలను కూడా సమీకరించి వాళ్లను ఎటువంటి సంఘటనలకు పాల్పడకుండా, ప్రోత్సహించకుండా హెచ్చరికలు చేయాల్సి వుంటుంది. ఈ కేసు విషయంలో రెండు కుటుంబాలను పిలిచి మాట్లాడినట్టు తెలిసింది. కాని అక్కడ అమ్మాయి అన్న ఇప్పుడు నిందితులలో ఒకరు. కృష్ణను ఎప్పటికైనా చంపుతామని బెదిరిస్తే అందరూ చూస్తూ వున్నారు. అప్పుడే ఆ వ్యక్తిని అరెస్టు చేసి కేసు పెట్టి ఉంటే కొంత మేలు జరిగేదేమో. కాని పోలీసులు ఆ పని చేయలేదు.
నాలుగో అంశం రాజకీయ నాయకుల పాత్ర. ఇటీవల జరిగిన ఏ సంఘటనలో పాలక పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, ఎంఎల్‌ఎలు కానీ, మాజీ ఎంఎల్‌ఎలు కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు. నిమ్మకు నీరెత్తినట్టు వున్నారు. తమకు సంబంధం లేని అంశంగా చూస్తున్నారు. అవతలి వాళ్లు దొంతరలో పైన ఉన్నవాళ్లే ఉంటారు కాబట్టి. వాళ్ల ఓట్లకు వాళ్లే కీలకం. అంతేకాకుండా మౌనంగా ఉంటే ఎవరితో గొడవ ఉండదనే భావన. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే చట్టాల ద్వారా చట్టసభలకు ఎన్నికవుతున్న ప్రతినిధులు దీనిని బాధ్యతగా తీసుకోవాలి. కాని పూర్తిగా దీనిని విస్మరిస్తున్నారు. అందువల్ల అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్నది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నారు. కాని నిజం కాదు. ఇది భావజాల సంఘర్షణ. ఇది భావజాల వైరుధ్యమైనప్పుడు దీనిని కేవలం పోలీసు కేసులు, అరెస్టులు, శిక్షలు మాత్రమే పరిష్కరించలేవు. అందుకే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, సామాజిక సంస్కర్తలు, ప్రజాస్వామ్యవాదులు ఒక ప్రధాన ఎజెండాగా స్వీకరించాలి.
అందుకుగాను ఒక సమగ్రమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. కులమనే ఒక మూఢనమ్మకం కులాల అసమానతలను పోషించి మనుషుల్ని విడగొడుతున్నదనే విషయాన్ని పాఠశాల స్థాయి నుంచే బోధించాలి. కుల విభేదాల వల్ల ఏ దేశం, ఏ జాతి, ఏ గ్రామం పురోగతి సాధించదనే విషయాన్ని ప్రతి మనిషికి, ప్రతి గడపకు చేరే విధంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. గతంలో ప్రతి జనవరి 30వ తేదీన గ్రామగ్రామాన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించేవాళ్లు. గత ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి బాధ్యతాయుతంగా వ్యవహరించింది. దీనిలో అధికారులందరూ పాల్గొని మానవ హక్కుల గురించి, ప్రజల మధ్య సామరస్యం గురించి వివరించి ప్రజలలో సోదరత్వం ఏర్పడే విధంగా కృషి చేయాలనేది దాని లక్షం. చివరగా, 2012లో భారత లా కమిషన్ ఇందుకు గాను ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని ప్రభుత్వాలకు సూచించింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పూనుకొని పార్లమెంటులో దీనికి గాను ప్రత్యేక చట్టం తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కులం పునాదుల మీద ఒక జాతిని, ఒక నీతిని నిర్మించలేం.
మల్లేపల్లి లక్ష్మయ్య
దర్పణం