మనతెలంగాణ, సిటిబ్యూరోః హుక్కా పార్లర్‌లో ఫ్లేవర్లను దొంగిలించి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అబిడ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన రూ.2.30లక్షల విలువైన హుక్కా ఫ్లేవర్లు, ఆటో, రెండు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ సోహైల్, మహ్మద్ మసూద్, మహ్మద్ అథేర్ కలిసి చోరీలు చేస్తున్నారు. నలుగురు నిందితులు జల్సాలకు అలవాటు పడ్డారు.
జల్సాలకు డబ్బులు లేకపోవడంతో హుక్కా పార్లర్లు మూసివేసిన తర్వాత షట్టర్లను ఓపెన్ చేసి ఫ్లేవర్లను చోరీ చేస్తున్నారు. అబిడ్స్ ఎంజే మార్కెట్‌లోని అగర్వాల్ ఛాంబర్స్ ట్రూప్ బజార్‌లోని ఓ హుక్కా షాపులో నిందితులు చోరీ చేశారు. వాటిని బయట విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. మహ్మద్ ఇర్ఫాన్ గతంలో కూడా కాచీగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు చేయడంతో పోలీసులు అరెస్టు చేశాసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించారు.