Friday, November 15, 2024

బిసి నినాదంపై కమల నాథుల ఆశలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సమరం ఊపందుకుంది. బరిలో నిలిచిన నేతలంతా గెలుపు కోసం ప్రచారంలో పరుగులు పెడుతూ ఈదఫా గెలిపిస్తే ప్రజా సమస్యలు తీర్చుతానని హామీలిస్తూ ఓటర్ల మచ్చిక చేసుకునేందుకు పడరాని తంటాలు పడుతున్నారు. ఇప్పటికే అధికారి బిఆర్‌ఎస్ మేనిఫేస్టో విడుదల చేయడంతో వాటిని అభ్యర్థులకు ప్రజలకు వివరిస్తూ ఈసారి అధికారం కట్టబెట్టాలని కోరుతున్నా. అదే విధంగా విపక్ష కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలు పేరుతో ప్రజల వద్దకు వెళ్లుతూ తమకు అధికారం ఇస్తే వీటిని పాలన ప్రారంభించిన ఆరునెలల్లో అమలు చేస్తామని ప్రసంగాలు దంచుతున్నారు. కానీ కేంద్రంలో పాలన సాగిస్తున్న బిజెపి ఇప్పటివరకు మేనిఫెస్టో పూర్తి కాలేదు నెల రోజుల కితం మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన తీరా సమయానికి పార్టీని వీడారు.

దీంతో మేనిపేస్టోలో ఏ అంశాలు చేర్చాలో అర్దం కాక రాష్ట్ర నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటివరకు నాలుగు విడుతల్లో 100మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి వారంతా ప్రచారంలో ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో వారు ప్రజల్లోకి వెళ్లతున్నారు. కానీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాల్లో అర్ధంకాక బిజెపిని గెలిపిస్తే బిసి ముఖ్యమంత్రి చేస్తామని పేర్కొనడం తప్ప స్దానిక సమస్యల గురించి మాట్లాడటంలేదు. ఇప్పటివరకు టికెట్లు ప్రకటించిన పార్టీలు బిసిలను చిన్నచూపు చూశారని కంటితుడుపు చర్యగా టికెట్లు కేటాయించి చేతులుదులుపుకున్నారని విమర్శిస్తూ తమ పార్టీ అత్యధికంగా 33 మంది బిసిలకు సీట్లు ఇచ్చినట్లు ఢంకా బజాయిస్తూ ప్రజలకు తమకు మద్దతు ఇవ్వాలని వేడుకుంటున్నారు. రెండు రోజుల కితం ఎల్బీస్టేడియంలో జరిగిన బిసి ఆత్మగౌరవ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరై బిసిలకు బిజెపి అండగా ఉంటుందని హామీ ఇవ్వడంతో సభకు ఊహించిన దానికంటే జనం తరలిరావడం చూసి బిసి నినాదం కమలం పార్టీకి కలిసి వస్తుందని ఆశల్లో తేలియాడున్నారు.

మరోపక్క బిసి ఏజెండా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే సీట్లు పంపిణీలో ఎక్కువ భాగం ఒకే సామాజిక వర్గానికి కేటాయింపుతో పాటు డబ్బులున్న వారికే ఇచ్చారని ద్వితీయ శ్రేణి నాయకులు విమర్శలు చేస్తున్నారని, దానిని పక్క దారి పట్టించాలని ప్రయత్నాలు చేస్తూంటే కమల నాథులు బిజెపి సిఎం అభ్యర్ది ప్రకటన హస్తం పార్టీని కలవర పెడుతుందని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు. అదే విధంగా ఈనెల 11న పరేడ్ మైదానంలో మాదిగ, ఉప కులాల విశ్వరూపం సభ ఏర్పాటు చేయడం ఆసభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకావడం కూడా ఎస్సీ, బిసి కులాల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చి ఎన్నికల సమయానికి దూరమైతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమలనాథులు మాత్రం ఏపార్టీ తీసుకోని గొప్ప నిర్ణయం తీసుకున్నామని, ఈ ఎన్నికల్లో తమకు బిసివాదం ఉపకరిస్తుందని, గతంలో ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News