Monday, December 23, 2024

నర్సంపేటకు ఉద్యానవన పరిశోధన కేంద్రం

- Advertisement -
- Advertisement -

వరంగల్: నర్సంపేట రూపు రేఖలు మార్చడానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం ముందు భారీ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. వాటిని ఒకొక్కటికిగా ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేస్తుండటం నర్సంపేటకు వరుసగా వరాల జల్లు కురిపించినట్లవుతుంది. తెలంగాణ ఉద్యమ సహచరునిగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సిఎం కెసిఆర్ అంకురార్పణ చేయడంతో రాష్ట్రంలోనే నర్సంపేట అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుంది. నాడు దేవాదుల ప్రాజెక్టును రంగాయ పాకాల చెరువులకు అనుసందానం చేస్తే నిన్న కనీవినీ ఎరుగని రీతిలో మెడికల్ కళాశాలను నర్సంపేటకు మంజూరు చేసి సంచలనం సృష్టించారు. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే మరో భారీ ప్రాజెక్టు అనే ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసి అందరిని ఆశ్ఛర్యపర్చారు.

నర్సంపేట నియోజకవర్గం మౌళిక సదుపాయాల కల్పనలో మెరుగైన అభివృద్ధిని సాధించడం వలన ప్రాజెక్టుల సాధనకు వసతుల సౌకర్యం అనుకూలంగా మారింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని ప్రపంచ పటంలో చూపించడానికి నిరంతరం చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రూపకల్పనకు ఆమోద ముద్ర వేయడం నర్సంపేట చరిత్రను అభివృద్ధిలో కొత్తగా రాస్తున్నట్లవుతుంది. నర్సంపేట నియోజకవర్గంలో ఉద్యానవన శాఖ నుండి మిర్చి పంటల సాగు అత్యధికంగా సాగు అవుతోంది. వేలాది ఎకరాల్లో సాగవుతున్న మిర్చి పంటలు ప్రతి సంవత్సరం చీడ, పీడలతో రైతులు నష్టాలకు గురవుతున్నారు. దాని కోసం ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మిర్చి పరిశోధన కేంద్రాన్ని స్థాపించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కావాల్సినంత స్థలం అనుకూలంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. పట్టువదలని విక్రమార్కుడిలా ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రాన్ని తీసుకువస్తే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందడమే కాకుండా శాస్త్రీయమైన పంటల

సాగుకు ప్రధాన కేంద్రంగా ఇక్కడి నుండి పరిశోధనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ ను ఒప్పించి శనివారం ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేయించారు. ఈ పరిశోధన కేంద్రం నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో యాబై ఎకరాలను కెటాయించడం వలన ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రానికి మార్గం సులభమైంది.ఈ పరిశోధన కేంద్రం ద్వారా ఉద్యానవన పంటలుగా ఉన్న మిర్చి, పండ్ల తోటలు, ఫామాయిల్ వంటి అనేక రకాల పంటల సాగుకు అందుకు అవసరమైన సీడ్ తయారీకి పంటల ఉత్పత్తుల ఎగుమతులకు పరిశోధన కేంద్రం ఎంతగానో ఉపయోగ పడనుంది . జాతీయ స్థాయి మార్కెట్‌కు ఇక్కడి ఉద్యానవన పంటలను ఎగుమతి చేస్తే రైతులకు ఈ పరిశోధన కేంద్రం ద్వారా భారీ మేలుజరగనుంది. వరంగల్ జిల్లా నుండి చపాట మార్చి సాగు అధికంగా ఉంటుంది. ఆ మిర్చికి జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ మార్కెట్‌లో కూడా డిమాండ్ ఉంటుంది. చపాట మిర్చి ద్వారా కారంతో పాటు ఆహార పదార్థాలకు కావల్సిన వివిధ రకాల కలర్స్‌ని కూడా తయారు చేస్తారు.

దాని డిమాండ్‌తో ఆ మిర్చికి జాతీయ మార్కెట్‌లో ఎక్కువ ధర పలకడంతో రైతులు దాని సాగుపైనే మక్కువ పెంచుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో వైరస్ సోకి మిర్చి పంటలన్నీ చేతికి రాకుండా పోతున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనలు అందుబాటులో లేకపోవడంతోనే రైతులు నష్టపోవడాన్ని గమనించి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేయించడానికి ప్రధానకారణంగా చెప్పుకోవచ్చు. పరిశోధన కేంద్రం కొండా లక్ష్మణ్‌బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుసందానంగా కొనసాగనున్నట్లు ప్రభుత్వం 31వ జీవో ద్వారా మంజూరు చేసింది. దీనికి సంబంధించిన యాబై ఎకరాల స్థలాన్ని కన్నారావుపేటలోని 58వ సర్వే నెంబర్‌లో స్థలాన్ని ప్రభుత్వం కెటాయించింది.
వ్యవసాయ కళాశాలలకు నిలయంగా పరిశోధన కేంద్రం…
నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేటకు మంజూరైన ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రం రానున్న రోజుల్లో విస్తృతం కానుంది. పరిశోధన కేంద్రానికి అనుసందానంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు వ్యవసాయ డిప్లమా, గ్రాడ్యుయేషన్ కళాశాలలు కూడా ఏర్పడనున్నాయి. వీటికి కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పన ఏర్పడటం వలన ఆ కళాశాలల మంజూరుకు అనుమతులు కూడా రానున్నాయి. ఎంతో కాలం నుండి ఈ ప్రాంత రైతులు శాస్త్రీయ విధానాలేమితో పంటలు సాగు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశోధన కేంద్రం ఏర్పాటుతో పాటు కళాశాలల ఏర్పాటు జరిగినట్లయితే విద్యార్థులకు ఈ ప్రాంతం ప్రయోగశాలగా మారనుంది. నర్సంపేట ప్రాంతం నుండి వందలాది మంది విద్యార్థులు అగ్రికల్చర్ డిప్లమా, బీఎస్సీ, ఎమ్మెస్సీల కోసం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు తరలివెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. వచ్చే ఏడాది నుండి వ్యవసాయ కళాశాలలు ఏర్పడితే ప్రభుత్వ పరంగా ఉచితంగా వ్యవసాయ విధానాన్ని స్థానిక విద్యార్థులతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా మారనుంది. రాష్ట్రస్థాయి పరిశోధన కేంద్రం రావడం వలన నూతన ఆధునిక పరిజ్ఞానంతో పంటల సాగుబడి సీడ్ తయారీ ఎక్కువగా ఇక్కడ జరిగే ఏర్పాట్లు ఉన్నాయి.

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, విద్యార్థులు, మేథావులు….
నర్సంపేటకు ఉద్యానవన పరిశోధన కేంద్రం రావడం పట్ల రైతులు, విద్యార్థులు, మేథావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన ఆధునిక పద్దతుల్లో శాస్త్రీయబద్దంగా ఉద్యానవన పంటలను పండించడానికి పరిశోధన కేంద్రం ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా వ్యవసాయ విద్యా విధానానికి అనుకూలంగా మారడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పెద్ది….
నర్సంపేటకు ఉద్యానవన పరిశోధన కేంద్రం మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, సహకరించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఉద్యానవన పంటల పరిశోధన కేంద్రం నల్లబెల్లికి తీసుకురావడం వలన ఈ ప్రాంతానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని అందుకు కృషి చేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి నల్లబెల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెట్టుపల్లి మురళి, ప్రవీణ్, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్వర్‌రావు, సారంగపాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News