Monday, December 23, 2024

భూములు అమ్మడం కాదు… హాస్టళ్ళు, గురుకులాలు నిర్మించాలి

- Advertisement -
- Advertisement -

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
బిసి విద్యార్థి సంఘం డిమాండ్
వేలమంది విద్యార్థులతో భారీ ధర్నా

మన తెలంగాణ / హైదరాబాద్ :  ప్రభుత్వ భూములు అమ్మడం ఆపి వాటిలో – హాస్టళ్ళు – గురుకుల పాఠశాలలు నిర్మించాలని బిసి విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఇంజినీరింగ్, -డిగ్రీ, -పి.జి తదితర కాలేజి కోర్సులు చదివే 14 లక్షల మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజులు బకాయిలు 5వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.బిసి జాబితాలోని 130 కులాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయ పథకాన్ని అమలు చేయాలని, అదనంగా 119 బిసి గురుకులాల మంజూరు చేయాలని, ధరఖాస్తు చేసిన ప్రతి విద్యార్ధికి గురుకుల సీటు ఇవ్వాలని డిమాండ్ చేసింది. పై డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర బిసి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం వేలాది మందితో ధర్నా జరిగింది.

ఈ ధర్నా నుద్దేశించి జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ళ బిఆర్‌ఎస్ పాలనలో ఒక్కరికి కూడా బిసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడైనా దరఖాస్తు దారులందరికి ఇవ్వకపోతే బిసిల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం 10 వేల కోట్లు గ్రాంటు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ., కాలేజీలలో 35 వేల కంటే ఎక్కువ ఫీజులు పెంచారని, పిజికి 20 వేల కంటే ఎక్కువ, డిగ్రీకి 10 వేల కంటే ఎక్కువ ఫీజులు పెంచారని కృష్ణయ్య తెలిపారు. బిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు అధనంగా 150 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదన్నారు. ప్రభుత్వ భూములు అమ్మడం ఆపి ఆ భూముల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి గురుకుల పాఠశాలలు కాలేజీ హాస్టళ్ళు నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో 295 బిసి కాలేజీ హాస్టళ్లకు, 321 బిసి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవని కృష్ణయ్య తెలిపారు. బిసి బంధు ప్రవేశపెట్టి రూ. 10 లక్షలు ఇవ్వాలని, కాలేజీ కోర్సులు చదివే బిసి విద్యార్థుల మొత్తం ఫీజుల పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ విదేశీ విద్య స్కాలర్‌షిప్ పథకాన్ని వర్తింపచేయాలని, ఇందుకోసం రూ. 300 కోట్లు కేటాయించాలని పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు, స్కాలర్ షిప్స్ ను పెంచాలని కోరారు. దశలవారీగా గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణానికి బడ్జెట్లో 400 కోట్లు కేటాయించాలన్నారు. బిసి స్టడీ సర్కిల్‌కు 200 కోట్లు కేటాయించాలని, బిసి కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో రూ. 2 వేల కోట్లు కేటాయించాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకొనే బిసి కులాల వారికి ప్రోత్సాహక పారితోషికం 2 లక్షల 50 వేలకు పెంచాలన్నారు. ఈ ధర్నాలో వేముల రామకృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అంజి, నందగోపాల్, పగిళ్ళ సతీశ్, రాజ్ కుమార్, భాస్కర్ ప్రజాపతి, రామ్ దేవ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News