రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమ హాస్టళ్ల బిల్లులు పదినెలలుగా విడుదలకు నోచుకోకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం హాస్టల్స్ బిల్లులు విడుదల చేయకపోవడంతో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీల బకాయీలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు, బిసి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ విషయంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి. ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. ప్రభుత్వం మెస్ బిల్లులు చెల్లించక పోవడంతో హాస్టళ్లు మూసివేస్తారా అని బిసి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గత మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసింది. కేటాయించిన బడ్జెటు ల్యాప్స్ అవుతుంది. గత 10 నెల హాస్టల్ మెస్ బిల్లులు , మూడు సంవత్సరాల ఫీజుల బకాయీలు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు పడరాని పాట్లు పడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 నెలలుగా బిసి హాస్టల్స్ మెస్ బిల్లులు చెల్లించక పోవడంతో హాస్టళ్ళకు నిత్యావసర వస్తువుల సరఫరా చేయడానికి వ్యాపారస్తులు విముఖత ప్రదర్శిస్తున్నారని విద్యార్థి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంగా కూరగాయలు, నూనెలు, పప్పులు, చికెన్, గుడ్డు ఇతర ఆహార దినిసులు ఇవ్వడానికి వ్యాపారస్థులు ముందుకు రాక పోవడంతో హాస్టళ్లు మూసివేసి పరిస్థితి ఏర్పడిందని బిసి నేత ఆర్. కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 700 బిసి, 1500 ఎస్‌సి, ఎస్‌టి వాస్టళ్లు ఉంటే వాటిలో దాదాపు 8లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటికి మెస్ చార్జీల బిల్లులు 10 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి. ఇక హాస్టల్ అద్దె భవనాల బిల్లులు, కరెంట్ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని విద్యార్థి నేతలు అంటున్నారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని హాస్టళ్ళ బకాయిలు చెల్లించాలని ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆద్దె భవనాల్లో కొనసాగుతునన బిసి కాలేజీ హాస్టళ్ళు అద్దె గత రెండు సంత్సరాలుగా చెల్లించడం లేదని, విపరీత జాప్యం వల్ల యజమానులు భవనాలు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 నెలలుగా హాస్టళ్ళ కరెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నందున పరీక్ష సమయంలో హాస్టళ్ళుకు కరెంటు సరఫరా నిలుపుదల చేస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ఫీజు బకాయిల వెంటనే చెల్లించాలి
ఇంజనీరింగ్, మెడిసెన్ – పిజి విద్యార్ధుల ఫీజుల బకాయిలు గత 3 సంవత్సరాలుగా పెండింగులో ఉన్నట్లు విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఫీజులు రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల బడ్జెట్‌ను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయక పోవడంతో విద్యార్థులు ఫీజులు కట్టాలని యాజ.మాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ విద్యార్థులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తునేన ఆర్ధికశాఖ అధికారులు బిసి విద్యార్థులు మెస్ బిల్లులు, – ఫీజుల బకాయిలు చెల్లించడం లేదని, అధికారులు బిసి వ్యతిరేక వైఖరి మార్చకపోతే తీవ్ర ప్రతి ఘటన ఎదుర్కోవలసి వస్తుందని బిసి నేతలు హెచ్చరిస్తున్నారు.