న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు గురువారం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 2.00గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బిజెపి ఎంపీలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అదానీ విషయంలో దర్యాప్తుకు డిమాండ్ చేశారు. ఈ గొడవ మధ్య స్పీకర్ ఓమ్ బిర్లా మధ్యాహ్నం 2.00 గంటల వరకు సభను వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా వాదప్రతివాదాలు, నినాదాల మధ్య చైర్మన్ జగదీప్ ధన్‌కర్ రాజ్యసభను మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభ వాయిదా పడకముందు పియూష్ గోయల్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ‘దేశానికి, పార్లమెంటుకు అపకీర్తి తెచ్చినందుకు రాహుల్ గాంధీ లోక్‌సభలో క్షమాపణలు చెప్పాలి’ అని గోయల్ అన్నారు. దీనికి ఒక రోజు ముందు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, వి.మురళీధరన్, ఇతరులు రాజ్యసభ చైర్మన్ ధన్‌కర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు.