బిపిఎల్ వర్గాలకు ఉచితంగా క్రమబద్దీకరణ చేయాలి.
రుసుం కట్టని వారి ఇండ్ల కూల్చివేతను నిలిపివేయాలి
మధ్యతరగతి దరఖాస్తుదారులకు నామమాత్రపు ధరను నిర్ణయించాలి
కూనంనేని సాంబశివరావు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
హైదరాబాద్ : జివొ 59 కింద పేద, మధ్య తరగతి వర్గాలకు నామ మాత్రపు ధరకే నివాస స్థలాలను క్రమబద్దీకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ జోవో క్రింద క్రమబద్దీకరణ రుసుంను ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా నిర్ణయించడంతో చెల్లించాల్సిన మొత్తం కొన్ని చోట్ల పదుల లక్షలలో ఉన్నదన్నారు. దీంతో జీవో 59 క్రింద తమ ఇంటి స్థలాలను క్రమబద్దీకరించు కోవాలనుకున్న చాలా మంది ఆశలు అడియాశలయ్యాయని, ఆ మొత్తాన్ని కట్టలేక పోతున్నారని తెలిపారు. నిర్ణీత తేదీలోగా క్రమబద్దీకరణ రుసుమును చెల్లించకపోవడంతో రెవెన్యూ యంత్రాంగం ఆ ఇండ్లను కూల్చివేసేందుకు పూనుకుంటుందన్నారు. ముఖ్యంగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. తక్షణమే సిఎం కెసిఆర్ జోక్యం చేసుకొని ఇండ్ల కూల్చివేతను నిలిపివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే జీవో 59 క్రింద క్రమబద్దీకరణకు మార్కెట్ ధర ఆధారంగా కాకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు వెసులు బాటు ఉండేలా నామమాత్రపు ధరను నిర్ణయించాలని కోరారు. జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న బిపిఎల్ వర్గాల వారికి జీవో 59 కింద ఉచితంగా క్రమబద్దీకరించేందుకు అవకాశం కల్పించాలని సూచించారు.