త్వరలోనే జర్నలిస్టులకు, ఎంఎల్‌ఎల స్థలాలు
కొత్త చట్టం తీసుకొచ్చి… అర్హులైన వారందరికి ఇస్తాం: సిఎం కెసిఆర్
హైదరాబాద్ : జర్నలిస్టులకు, శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా ఇళ్ళ స్థలాల సమస్యకు ఒక పరిష్కారం లభింస్తుందని స్పష్టం చేశారు. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినపించి ఈ సమస్యకు ముగింపు పలుకపోతున్నామన్నారు. తనకున్న సమాచారం మేరకు ఈ నెలలోనే అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయన్నారు. భవిష్యత్తులో స్థలాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఆ చట్టం మేరకు అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని సిఎం కెసిఆర్ హామి ఇచ్చారు. అయితే కొంపల్లిలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటి టవర్‌ను ఏర్పాటు చేయనుందని…ఆ స్థలాన్ని ఐటి టవర్‌కు కాకుండా తమకే కేటాయించాలని పలువురు జర్నలిస్టులు సిఎం కెసిఆర్‌ను అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఒక చోట స్థలం పోయినా ఫరవాలేదు…రెండు,మూడు చోట్ల కీలకమైన ప్రాంతాల్లోను సేకరించి జర్నలిస్టులకు, శాసనసభ్యులకు స్థలాలను కేటాయిస్తామన్నారు. తాను మాట ఇచ్చాను అంటే….అది జరిగిపోయినట్లే లెక్క అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తానే చొరవ తీసుకుని స్థలాలు ఇస్తామన్నారు. కనీసం మన పిల్లలకు అయిన అత్యంత ఖరీదైన స్థలాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.