ఇన్‌స్టాగ్రాంలో ఓ మహిళ ఫొటో మార్ఫింగ్ చేసి బెదిరించి ఆమెకు పంపి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మొయిల్‌కు పాల్పడిన ముగ్గురు యువకులను చితకబాదిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ సత్యనారాయణ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం…అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తొర్రూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్‌కు ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడకు చెందిన ఒక యువతితో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఆమె చిన్నాన్న కొడుకులు విజయ్, సాయి, సూర్య ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి కాలేజీ సమయంలో తీసిన ఫొటోలతో ఇన్‌స్టాగ్రాంలో బయట పెడుతామని బెదిరించి డబ్బులు అడగడంతో ఆమె నిరాకరించింది.
ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైనా రాఘవేందర్‌తోపాటు భరత్, విజయ్, కొమురయ్య కృష్ట, మరికొంతమంది యువకులు శేరిగూడకు వచ్చి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న యువకులను బలవంతంగా నాగన్‌పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ముగ్గుర్ని కర్రలు, బెల్టులు, చైన్‌లో తీవ్రంగా గాయపర్చారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత యువకుల తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వెళ్ళి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.ఈ విషయంపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇందుకు బాధ్యులను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.