Monday, January 20, 2025

ప్రధాని నీతి చంద్రిక

- Advertisement -
- Advertisement -

CM Shinde Expands Cabinet Over 40 Days ‘భారత దేశం ప్రజాస్వామ్య జన్మస్థలం. మన భిన్నత్వమే మన బలం, భిన్న వర్గాల ప్రజలను కలిపి ఉంచుతున్న దేశభక్తే ఇండియాను దృఢంగా వుంచుతున్నది. ఇండియా సదాశయ సంపన్న దేశం, ఇక్కడ మార్పులు సంఘ చైతన్యంతో ఆవిష్కృతమవుతాయి’ -ప్రధాని నరేంద్ర మోడీ 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుంచి పలికిన ఈ పలుకులు ప్రత్యక్షర సత్యాలు. ముఖ్యంగా మన భిన్నత్వమే మన ఔన్నత్యమని మోడీ చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. దానిని కాపాడుకుంటున్నామా, ధ్వంసం చేసుకుంటున్నామా అనేది ఇప్పుడు చర్చించుకోవలసిన అంశం. ముస్లిం మైనారిటీ మీద పగబట్టిన విధంగా, వారి సమ్మతి లేకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు గాని, పాలక బిజెపి, దాని పరివార సంస్థలు చేపట్టిన లవ్ జిహాద్, హిజాబ్ వ్యతిరేక విచ్చిన్నకర కార్యక్రమాలు గాని, జాతి భిన్నత్వాన్ని బలి తీసుకొంటున్నాయన్న కఠోర సత్యాన్ని దాచిపెట్టి మోడీ ఈ మాటలన్నారు.

అయినా ఆయన తన మాట మీద నిలబడి భారత జాతి భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తే అంతకంటే కావలసిందేముంది? ఆచరణలో చూపని ఆదర్శాలు ఏల? ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను మినహాయించి మిగతా ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులందరినీ ప్రస్తావించి, ప్రస్తుతించిన ప్రధాని మోడీ రాజకీయ ప్రత్యర్థులను ఎత్తి చూపి ఎండగట్టడానికే తన ప్రసంగంలో ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మన అనేక సంస్థలు కుటుంబ పాలన వల్ల దెబ్బతిన్నాయన్నారు. కుటుంబ పాలన మన నైపుణ్యాన్ని, సామర్ధ్యాలను హరించి అవినీతికి అవకాశం కలిగించిందని విమర్శించారు. కుటుంబ పాలనను ప్రధాని మోడీ దుయ్యబట్టడం ఇది మొదటి సారి కాదు. జాతీయ స్థాయిలో రాజ్యాంగ సంస్థల నిష్పాక్షికతను బలి తీసుకోడంలో కాంగ్రెస్ పాలన కంటే తమ హయామే నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నదనే చేదు వాస్తవాన్ని ప్రధాని విస్మరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి పాలన అయినా ప్రజలకు మంచి చేయడం ద్వారానే మనగలుగుతుంది. తమకు చెడు చేసే పాలకులను వారు ఆలస్యంగానైనా ఇంటికి పంపించడం ఖాయం.

కేవలం విద్వేషానలం రగిలించి భావోద్వేగాలను రెచ్చగొట్టడం కొంతకాలమే అధికారంలో ఉంచగలుగుతుంది. ఇది ఆయనకు తెలియనిది కాదు. అవినీతి చెద దేశాన్ని గుల్లబారుస్తున్నదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది అవినీతికి జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ సామాజిక ఆమోదాన్ని పొందడం, కీర్తింపబడడం జరుగుతున్నదన్నారు.ఈ ఆమోదాన్ని తొలగించనంతవరకు అవినీతి నిర్మూలన కాదన్నారు. బహుశా లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు అని ఉండవచ్చు. అవినీతి విషయంలో దొరకని వారందరూ దొరలే అనే పరిస్థితి దేశంలో నెలకొన్నది. అనేక కుంభకోణాల్లో కూరుకుపోయినవారు భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకోడం ద్వారా సురక్షితంగా ఉండగలుగుతున్నారనే అభిప్రాయం నెలకొని ఉంది. వాస్తవానికి జరుగుతున్నది అదే.

రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలో ఇడి, సిబిఐ వంటి కేంద్ర నేర దర్యాప్తు సంస్థల సోదాలు జరిపించి, ఆధారాలు లేని అవినీతి కేసులు బనాయిస్తున్నారని, అడ్డు తొలగించుకోడానికే వారిని అప్రతిష్ఠ పాలు చేస్తున్నారని లోకం కోడై కూస్తున్నది. ప్రజామోదమనేది బిజెపి గుత్త సొత్తు కాదు. ప్రధాని మోడీ అన్నట్టు అవినీతిని మూలమట్టం గా పెకలించవలసిందే, కాని అది ఏకపక్షం కావడమే అభ్యంతరకరం. అవినీతి ప్రతిపక్షం లోనే ఉందని, తమ వారంతా కడిగిన ముత్యాలేనంటే కుదరదు.రాష్ట్రాల మధ్య పోటీ పెరగాలన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ వర్ధిల్లాలన్నారు ఆచరణలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ రెండు ఆశయాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అనన్యమైన అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను ఆర్ధిక ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఆ విధంగా వాటిలోని పోటీతత్వాన్ని దెబ్బతీసి నిరంతరం నూతన శిఖరాలను అధిరోహించాలనే ఆరాటాన్ని అణగదొక్కుతున్నది. ఇంకొక వైపు ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలను సంప్రదించకుండా తన ఇష్టానుసారం చట్టాలు చేస్తున్నది.

ఇంతకు ముందు మూడు తిరోగామి, కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో వాటిని రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు జాతీయ విద్యా విధానాన్ని కూడా తనకు తానుగా రూపొందించి రాష్ట్రాలపై రుద్దాలని చూస్తున్నది. ప్రధాని తన ప్రసంగంలో దీనిని ప్రత్యేకంగా ప్రశంసించారు.ఇలా క్రియల్లో నిరంకుశ పోకడలు, విభజన వ్యూహాలు పాటిస్తూ ఆదర్శాలను ప్రసంగాలకే పరిమితం చేయడం వల్ల ప్రయోజనం శూన్యం. ఆజాది కా అమృతోత్సవ వేళ జాతికి ప్రధాని సూచించిన అయిదు సంకల్పాల్లో నాలుగోది ఐక్యత, ఉమ్మడి ప్రయోజన సాధన. అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యాన్ని కాపాడడం, స్వపక్ష, ప్రతిపక్ష పాలిత అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల మేలుకు తోడ్పడి నిజమైన సమాఖ్య నీతిని కేంద్రం పాటించినప్పుడే భారతదేశం మరింత బలమైన శక్తి కాగలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News