Sunday, November 3, 2024

ఎంత మంది అనాథలయ్యారో!

- Advertisement -
- Advertisement -

How many children orphaned by Covid: Supreme court

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారినందరినీ తక్షణం ఆదుకోండి
రాష్ట ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం
మీప్రాంతంలో అనాథల వివరాలను సేకరించి
బాలల హక్కుల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి
జిల్లా అధికారులకు ఆదేశం

న్యూఢిల్లీ: కోట్లాది మంది జీవితాలను ఛిద్రం చేసిన కరోనా మహమ్మారి కారణంగా ఇంత పెద్ద దేశంలో ఎంతమంది చిన్నారులు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారినందరినీ గుర్తించి సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా వీథుల్లో తిండి లేక ఆకలితో అల్లాడే చిన్నారుల బాధను రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం కోర్టులనుంచి తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా వారిని తక్షణం ఆదుకోవాలని జిల్లా అధికారులను అదేశించింది తమ ప్రాంతాల్లో అనాథ బాలలను గుర్తించి శనివారం సాయంత్రానికల్లా వారి వివరాలను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని న్యాయమూర్తులు ఎల్‌ఎన్ రావు,అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ జిల్లా అధికారులను ఆదేశించింది. కొవిడ్19, లేదా ఇతర కారణాల వల్ల అనాథలుగా మారిన చిన్నారులను గుర్తించడానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సూమోటో కేసులో అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ దాఖలు చేసిన దరఖాస్తుపై కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.

అనాథలైన చిన్నారుల పరిస్థితి, వారికి తక్షణ సాయం అందించడానికి తీసుకున్న చర్యలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తెలియజేయాలని బెంచ్ ఆదేశించింది. ‘మహారాష్ట్రలో 2,900 మందికి పైగా చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారారని పత్రికల్లో వార్తలను చూశాం. అలాంటి పిల్లలు ఎంత మంది ఉన్నారో కచ్చితంగా తెలియదు. ఈ మహమ్మారి కారణంగా ఇంత పెద్ద దేశంలో ఎంతమంది చిన్నారులు అనాథలుగా మారారో అంచనా వేయలేము కూడా ’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కోర్టుకు రావాలని బెంచ్ రాష్ట్రప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోరింది. ఇలాంటి పిల్లలను ఆదుకోవలసిన బాధ్యత రాష్ట్రప్రభుత్వ అధికారులపై ఉందని బెంచ్ పేర్కొంది. కాగా కరోనా కారణంగా తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరినీ, లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు లెక్కలేనంత మంది ఉన్నారని, అందుకే తాను ఈ అప్లికేషన్ దాఖలు చేశానని విచారణ సందర్భంగా అగర్వాల్ తెలిపారు.

2020 మార్చినుంచి కొవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రెండు రకాల చిన్నారులు ఉన్నారని, తల్లిదండ్రులు, లేదా సంరక్షకులు ఇద్దరినీ కోల్పోయిన వారు ఒక కేటగిరీ కాగా, సంపాదించే వారిని కోల్పోయిన వారు రెండో కేటగిరీ అని ఆయన చెప్పారు. మరో అందోళన కలిగించే విషయం ఏమిటంటే చిన్న పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల విక్రయాలు పెరగడమని అగర్వాల్ తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నందున పరిస్థితి మరితం తీవ్రంగా ఉండవచ్చని కూడా ఆయన అన్నారు. కాగా అనాథలైన పిలల్లను ఆదుకోవడానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలకు ఒక అడ్వైజరీ జారీ చేసిందని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాతి చెప్పారు. ఇలాంటి పిల్లలను గుర్తించిచడం కోసం తమ కమిషన్‌లో ‘ బాల స్వరాజ్’ పేరుతో ఒక పోర్టల్ ఉందని, జిల్లాల అధికారులు తమ డేటాను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి పాస్‌వర్డ్ కూడా ఇవ్వడం జరిగిందని ఎన్‌సి పిసిఆర్ తరఫున హాజరైన న్యాయవాది స్వరుపమా చతుర్వేది చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News