Sunday, January 19, 2025

కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ

- Advertisement -
- Advertisement -

గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం
కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది
ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది
ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి ఖరీదైన శస్త్రచికిత్సలు
ప్రజలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేస్తున్నాం
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు
గాంధీలో రూ.13 కోట్లతో నూతన ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం,
రూ.9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి

How many government hospitals in telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సర్కారు దవాఖానాలు కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోవడం లేదని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆసుపత్రులు..ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో కొత్త రూపు సంతరించుకున్నాయని అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం రూ.13 కోట్ల విలువైన నూతన ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రం, రూ.9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్‌ను మంత్రి హరీశ్‌రావు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి హరీశ్‌రావు గాంధీలో వార్డుల్లో తిరిగి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గాంధీ ఆసుపత్రిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. దాదాపు రూ.100 కోట్లతో అత్యంత అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూరుతున్నట్లు పేర్కొన్నారు. గాంధీలో రు. 55 కోట్లతో ఎంసిహెచ్ నిర్మాణ పనులు, రు. 2 కోట్లతో 100 పడకల ఐసియు పనులు, దాదాపు కోటి రూపాయలతో పేషంట్ షల్టర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రూ. 2.50 కోట్లతో ఏర్పాటు చేసే సంతాన సాఫల్య కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. సంతానం లేని దంపతులకు ఈ సెంటర్ వరంగా మారనుందని అన్నారు. రాష్ట్రంలో ప్లేట్ల బురుజు, వరంగల్, గాంధీ ఆసుపత్రుల్లో రూ.7.50 కోట్లతో సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. సంతానం లేని వారి నుండి ప్రైవేటు కేంద్రాలు పెద్ద మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు.

కరోనా సమయంలో గాంధీ అపద్భంధువుగా మారింది

గాంధీ ఆసుపత్రికి ఘన చరిత్ర ఉందని, తెలంగాణ జిల్లాల నుండి మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సమైక్య పాలనలో గాంధీ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రి అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. వసతులు, మౌలిక సదుపాయాలు సమకూర్చడం వల్ల కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటిందని చెప్పారు. గాంధీ ఆసుపత్రి కరోనా సమయంలో అపద్భందువుగా మారిందని, సుమారు లక్ష మంది పాజిటివ్ కేసులకు చికిత్స అందించిందని తెలిపారు. 1,698 కొవిడ్ డెలివరీలు చేయడంతోపాటు 1,163 మందికి బ్లాక్ ఫంగస్ సర్జరీలు చేసిందని అన్నారు. ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా ఆసుపత్రుల ఆధునికీకరణ, అధునాతనమైన వైద్య పరికరాలు సమకూర్చడం వల్ల, ఖరీదైన వైద్య సేవలు పేదలకు ఉచితంగా అందుతున్నాయని చెప్పారు. మోకాలి చిప్ప మార్పిడి అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, పైసలు ఉన్నోళ్లు సర్జరీ చేసుకుంటే పేదలు పంటి కింద ఆ బాధను అనుభవిస్తూ జీవితాంతం ఉండే పరిస్థితి ఉండేదన్నారు. ఒక్కో ఆపరేషన్‌కు ప్రైవేటులో 2 నుండి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో నాలుగు నెలల్లో 48 మోకీలు ఆపరేషన్లు జరుగగా, ఉస్మానియాలో గత 6 నెలల్లో 50పైగా మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయని పేర్కొన్నారు. వీటి విలువ మొత్తంగా దాదాపు రూ.2 కోట్ల పైనే ఉంటుందని అన్నారు. నిజామాబాద్, వేములవాడ, సిద్దిపేటలో మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ప్రారంభం అయ్యాయని, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

గాంధీలో క్యాత్‌ల్యాబ్ సేవలు

రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టిందా లేదా తెల్సుకునేందుకు, తద్వారా స్టంట్‌లు అమర్చి ప్రాణాలు కాపాడేందుకు గాంధీలో ఏర్పాటు చేసుకున్న క్యాత్‌ల్యాబ్ ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. ఉస్మానియాలో ప్రారంబించిన క్యాత్‌ల్యాబ్ వల్ల 250 మందికి గుండె సంబంధ రోగులకు యంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్ చికిత్సలు అందించినట్లు చెప్పారు. ఇక నుండి ఈ సేవలు గాంధీలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఎంజీఎం, ఖమ్మం, అదిలాబాద్‌లో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని, క్యాత్‌ల్యాబ్ వల్ల దాదాపు 21 రకాల ప్రొసీజర్స్ చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన సిఎం కెసిఆర్ గతంతో పోల్చితే రెట్టింపు నిధులు కేటాయించారని అన్నారు. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ధర్మాసుపత్రులే దిక్కు అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటివైపే చూస్తారని, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. ఏండ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా, ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదని విమర్శించారు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఒకటి, రెండు.. కాదు.. ఏకంగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. రూ.2,679 కోట్లతో ఏర్పాటయ్యే టిమ్స్ ఆసుపత్రులకు సిఎం ఇటీవల శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇవి ప్రస్తుత ఆసుపత్రులపై పేషెంట్ల ఒత్తిడిని తగ్గించనున్నాయని తెలిపారు. ఆసుపత్రుల్లో ఉండే రోగుల సహాయకుల కోసం 18 చోట్ల రూ. 5 భోజనం అందిస్తున్నామని, వారి కోసం షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ, ప్రజలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి ఫరూక్ హుస్సేన్, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిఎంఇ రమేష్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News