Tuesday, November 5, 2024

నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలని ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు పరిశీలన
అటవీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు నాటిన మొక్కలపై రాండమ్ సర్వే

మన తెలంగాణ/హైదరాబాద్ : గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, వాటిలో బతికిన శాతంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనే దానిపై రాండమ్ సర్వే చేయాలని తలపెట్టింది. ఇందుకు అవసరమైన విధి విధానాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. దీని కోసం జిల్లా అటవీ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీల ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో ఒక అటవీ అధికారితో పాటు సంబంధిత శాఖ నుంచి ఒక అధికారి చొప్పున స్థానం కల్పిస్తామన్నారు. ఈ బృందాలు మొక్కలు నాటిన అన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తాయని వెల్లడించారు. గత రెండేళ్లలో (2019, 2020) నాటిన మొక్కలను ఈ బృందాలు పరిశీలించనున్నాయి. ప్రధానంగా బ్లాక్ ప్లాంటేషన్, లీనియర్ ప్లాంటేషన్, స్కాటర్డ్ ప్లాంటేషన్‌లపై ఈ స్టడీ జరగనుంది. గత కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు.
రాండమ్ సర్వే ద్వారా ఒక్కో ప్రాంతంలో గత రెండేళ్లలో ఎన్ని మొక్కలు నాటారు? అందులో ఎన్ని బతికాయి? కనీస ఎత్తు, చనిపోతే మార్చిన మొక్కల శాతంపై ప్రధానంగా ఈ అధ్యయనం జరగనుందన్నారు. ఈ శాఖలు గతంలో మొక్కలు నాటుతూ ఆయా ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి, టిజిఎఫ్‌ఎంఐఎస్ వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేశాయి. ఈ నివేదిక ఆధారంగానే ఈ సర్వే జరుగుతుందని శాంతి కుమారి తెలిపారు. తెలంగాణకు హరితహారం ఫలితాలను సమీక్షించుకునేందుకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ అధ్యయనం ఉపయోగకరంగా ఉంటుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అన్నారు.
ప్రభుత్వం చేసిన సూచనల మేరకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సరైన ఫలితాలను నివేదిక రూపంలో అందించాలని సమావేశంలో పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్. శోభ అధికారులను కోరారు. ఈ సమావేశంలో పిసిసిఎఫ్ (సోషల్ ఫారెస్ట్) ఆర్.ఎం. డోబ్రియల్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ స్పెషల్ కమీషనర్ ప్రసాద్, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News