ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 10 లక్షల ఉద్యోగ నియామకాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించడం, ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించడం సంతోషించవలసిన పరిణామమే. ఈ నిర్ణయం నిజాయితీగా అమలైతే కొవిడ్ వల్ల తీవ్రతరమయిన నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎంతో కొంత తోడ్పడవచ్చు. అయితే యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో మోడీ గతంలో చేసిన వాగ్దానానికి ఆచరణలో ఆయన చేసిన దానికి గల భారీ తేడాను గమనిస్తే ఈ పది లక్షల కొలువుల కల్పన ఆదేశంపై విశ్వాసం కలగదు. నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆ మేరకు ఇచ్చి వుంటే గత ఎనిమిదేళ్ల మోడీ పాలనలో పదహారు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉండవలసింది. అది బొత్తిగా జరగలేదు. ఇంతవరకు సాగిన మోడీ హయాంలో ఆ దిశగా ఈని పుల్ల అయినా కదల లేదు. మత వైషమ్యాల వైపు యువతను రెచ్చగొట్టినంతగా వారి జీవితాలను తీర్చిదిద్దే పని జరగలేదు. ఇది ఎవరూ కాదనలేని కఠోరసత్యం. తక్కువ ప్రభుత్వం, యెక్కువ పాలన అనే సూత్రాన్ని మోడీ ప్రభుత్వం ప్రాణప్రదంగా పరిగణిస్తుంది. తక్కువ సిబ్బంది భారంతో ఎక్కువ నాణ్యమైన పాలన అందించవచ్చని మోడీ 2014 సాధారణ యెన్నికల సమయంలోనూ ఆ తర్వాత ప్రకటించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలను విలీనం చేయడం కూడా అందులో భాగమేనని ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కేంద్రంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయకుండా వదిలేశారు.అందువల్ల పాలన నాణ్యత యే మాత్రం మెరుగుపడలేదు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 నాటికే 8 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్టు ప్రభుత్వమే పార్లమెంటులో ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటికి ఇంకెన్ని ఖాళీలు వచ్చిచేరి ఉంటాయో! ఉద్యోగాలు కేవలం ప్రభుత్వ రంగానివే కానక్కరలేదు. ప్రయివేటు రంగం విస్తరణ ద్వారా కూడా నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు.
కాని, భారీగా పెట్టుబడులు రావడమో, దేశీయ పెట్టుబడులు గణనీయంగా పెరగడమో జరిగితే గాని ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు కలగవు. ప్రధాని మోడీ ప్రకటించిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ వంటి పథకాల సాఫల్యం శూన్యమే. అందుచేత ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కల్పన, ఖాళీల భర్తీ మాత్రమే ఇప్పుడు జరగవలసి వుంది. కరోనా వల్ల ప్రైవేటు రంగంలో కోల్పోయిన ఉద్యోగాలు పూర్తిగా పునరుద్ధరణ కాకపోడం వల్ల చాలా మంది కొలువులపై ఆశలు వదులుకొన్నారని అధ్యయనాల్లో వెల్లడయింది. ఆ విధంగా నిరాశతో ఉద్యోగరంగం నుంచి తొలగిపోయినవారు 67 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. వారి కుటుంబాలు ఆ మేరకు ఎంత దెబ్బ తింటాయో ఊహించవచ్చు. స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల ఉద్యోగ కల్పనలో ప్రతిబింబిస్తుందనేది భ్రమగానే రుజువువుతున్నది. ప్రయివేటు యాజమాన్యాలు మితిమించిన యాంత్రీకరణను ఆశ్రయించడం, అస్థిర ఉద్యోగాలతో అతి తక్కువ వేతనాలతో బండ చాకిరీ చేయించుకోడం వంటి కారణాల వల్ల ఆ కొలువులు ఆకర్షణను కోల్పోయాయి. భారత దేశంలో స్థూల దేశీయాత్పత్తి పెరిగినందు వల్ల ఉద్యోగావకాశాలు గణనీయంగా కలుగబోవని నిపుణులు నిగ్గు తేల్చారు. అందుచేత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు అంచనాలకు మించి వున్నాయి. కాని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడం లేదు. అందువల్ల ప్రధాని మోడీ ప్రకటించిన పది లక్షల ఉద్యోగాల పట్ల యువత విశేషంగా దృష్టి కేంద్రకరించడం సహజం. దరఖాస్తు ఫీజుల ద్వారా నిరుద్యోగుల ముక్కు పిండి వసూలు చేసి చేతులు దులుపుకోకుండా ఈ పది లక్షల నియామకాలు తేడా లేకుండా జరిపించవలసి ఉంది.
దేశంలో ఏడాదికి 2 నుంచి 5 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే గల మధ్యతరగతి కుటుంబాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ప్రతి వొక్క కుటుంబంలోనూ డిగ్రీలు, పిజిలు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ వయసు ముదిరిపోతున్నవారు విశేష సంఖ్యలో వున్నారు. నాడు మన్మోహన్ సింగ్ మీద ఆ తర్వాత నరేంద్ర మోడీ మీద ఆశలు పెట్టుకొని వారికి భారీగా వోటు వేసినవారిలో ఈ యువతరమే యెక్కువ. ఎప్పటికీ ఉద్యోగాలు రాక గరిష్ఠ వయోపరిమితి దాటిపోయినవారు చాలా మంది ఉంటారు. మిగిలినవారు ఏదో వొక ఉద్యోగం కోసం ప్రయివేటు కార్యాలయాల మెట్లు యెక్కీ దిగుతూనే వున్నారు. మోడీ రాబోయే అసెంబ్లీల, 2024 సాధారణ ఎన్నికలపై దృష్టితో ఈ యువతను మళ్లీ భ్రమల్లో ముంచి వారి ఓట్లను కాజేయడానికే పది లక్షల ఉద్యోగాల ప్రకటన చేశారని స్పష్టపడుతున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానానికి పట్టిన దుర్గతే దీనికి కూడా పట్టకుండా చూడవలసిన బాధ్యత ఆయనపై ఉంది.