రాష్ట్రంలో నికర ఆర్థిక లోటు రూ.26,050 కోట్లు
రెవెన్యూ ఖర్చు రూ.1,49,866.10 కోట్లు
రూ. 58వేల కోట్లకు చేరిన అప్పులు
తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్
గత ఏడాదికంటే 14.5 శాతం వృద్ధి రేటు
జీడీపీలో రాష్ట్ర వాటా 5.1 శాతం
ప్రతిపాదిత బడ్జెట్ కంటే రూ.9వేల కోట్లు ఎక్కువ అప్పుల సేకరణ
జనవరి నెలాఖరుకే రూ.26,050 కోట్ల లోటు ఉందని తేల్చిన కాగ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్థికలోటును అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. అప్పులు పెరిగి ఆదాయం తగ్గడంతో పథకాలకు నిధులు సమకూర్చేందుకు అష్టకష్టాలు పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి నికర ఆర్థిక లోటు ఏకంగా 8,758 శాతానికి చేరింది. అంటే రాష్ట్ర ఖజానాకు వస్తున్న రెవెన్యూ ఆదాయానికి, ఖజానా నుంచి పెడుతున్న రెవెన్యూ ఖర్చుకు మధ్య ఆ మేరకు తేడా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ విషయం వెల్లడించింది. 2025 జనవరి మాసాంతానికి గాను వార్షిక బడ్జెట్ స్థితిగతులపై కాగ్ ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో నికర ఆర్థిక లోటు రూ.26,050 కోట్లకు చేరింది.
జనవరి నెలాఖరుకు రెవెన్యూ ఆదాయం రూ.1,23,815.60 కోట్లు ఉండగా, రెవెన్యూ ఖర్చు రూ.1,49,866.10 కోట్లుగా నమోదైంది. ఆదాయం కంటే ఖర్చు రూ.26 వేల కోట్లకు పైగా ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2024 -25 వార్షిక బడ్జెట్‌లో రూ.297.42 కోట్ల మేర నికర ఆర్థిక మిగులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 8,758 శాతం మేరకు నికర లోటు చేరుకోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ మేరకు నికర ఆర్థిక లోటు ఎప్పుడూ లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక తలపోటు లాంటి పరిస్థితి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ అంచనాలకు, రాబడులకు పొంతన లేకుండా పోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.21 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినా జనవరి మాసాంతానికి కేవలం రూ.1.23 లక్షల కోట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండగా అంచనాల్లో 56 శాతమే ఆదాయం రావడం, ఇంకా రూ.లక్ష కోట్ల వరకు రావాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడులు రూ.1.64 లక్షల కోట్లు వస్తాయని 2024 -25 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించగా జనవరి మాసాంతానికి రూ.1,12,772 కోట్లు మాత్రమే (68 శాతమే) సమకూరాయి. ఆదాయార్జన శాఖల వారీగా చూస్తే ఎంతో కొంత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.58,594 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా అందులో 73 శాతం అంటే రూ.42,658 కోట్ల మేర సమకూరింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆశలు పెట్టుకోగా ఇప్పటివరకు కేవలం రూ.5,821 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా లాంటివి కూడా ఓ మోస్తరుగా వచ్చినా, ఎక్సైజ్, పన్నేతర రాబడులు తగ్గిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా బడ్జెట్ అంచనాలతో పోల్చుకుంటే కేవలం 24 శాతమే రావడం గమనార్హం.
రూ. 58వేల కోట్లకు చేరిన అప్పులు : ఆదాయం భారీగా తగ్గగా, మరోవైపు అప్పుల పద్దు భారీగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బహిరంగ మార్కెట్‌లో రూ.49,225 కోట్ల రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా జనవరి నెలాఖరుకే అప్పులు రూ.58 వేల కోట్లకు చేరాయి. మరో రెండు నెలల్లో ఇంకో రూ.20 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్‌బీఐ దగ్గర షెడ్యూల్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈసారి అప్పుల చిట్టా రూ.80 వేల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రూ.22 వేల కోట్ల కు పైగా గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీల కిందే చెల్లించాల్సి రావడం గమనార్హం. పెట్రోలియం ఉత్పత్తులు, మద్యంపై వ్యాట్, మోటారు వాహన పన్ను, స్టాంపులు సుంకం, రిజిస్ట్రేషన్ ఫీజులు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలను ఇకపై పెంచలేం కాబట్టి, రాష్ట్ర సొంత పన్ను, పన్నేతర ఆదాయ వనరుల నుండి అదనపు వనరులను సమీకరించడానికి ఆర్థిక మంత్రి పయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు హామీలతో పాటు అనేక ఇతర వాగ్దానాలను అమలు చేయడంలో ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం, కొనసాగుతున్న పథకాలతో పాటు హామీలు, వాగ్దానాలపై ఖర్చు చేయడానికి చాలా తక్కువ వనరులను కలిగి ఉండటంతో తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎఫ్‌ఆర్‌ఎంబీ చట్టం నిబంధనల ప్రకారం బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి రాష్ట్రం అంగీకరించదు. ఎందుకంటే నిబంధనలను సడలించి, అధిక రుణాలు తీసుకోవడానికి వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తెలంగాణ పట్టించుకోవడంలేదు.
తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ : తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564గా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. సిక్కిం, ఢిల్లీ, గోవా, ఛండీగఢ్ వంటి చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ, తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) అధికారిక వినియోగం కోసం 2024 సంవత్సరానికి గాను ‘తెలంగాజాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,84,205గా ఉందని, దానికంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,72,359 ఎక్కువని వివరించింది. తెలంగాణ తలసరి ఆదాయం 2022 -23 నుంచి 2023- 24 మధ్య కాలంలో 14.1 శాతం పెరిగిందని, దక్షిణాది రాష్ట్రాలన్నిటినీ అధిగమించిందని తెలిపింది. ఇక రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) వృద్ధి రేటు విషయంలో తెలంగాణ దేశంలోనే ఏడో రాష్ట్రంగా నిలిచిందని ప్రభుత్వం వెల్లడించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి తెలంగాణ 5.1 శాతం వాటాను అందిస్తుందని వివరించింది.
2023- 24 సంవత్సరానికిగాను జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.15,01,981 కోట్లుగా ఉందని అట్లాస్ వివరించింది. రాష్ట్ర జీఎస్‌డీపీ 14.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపింది. ఇతర పెద్ద రాష్ట్రాల జీఎస్‌డీపీలతో పోలిస్తే రాష్ట్ర జీఎస్‌డీపీపరంగా తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో నిలుస్తోందని వివరించింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. 2022- 23లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.13,11,823 కోట్లు ఉండగా 2023- 24 సంవత్సరంలో 14.5 శాతం పెరిగి రూ.15,01,981 కోట్లకు చేరింది. 2022 -23లో 14.2 శాతంగా ఉన్న జీడీపీ 2023- 24లో 9.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. 2014 -15 నుంచి 2023- 24 మధ్య కాలంలో తెలంగాణ జీఎ్‌సడీపీ సగటు వృద్ధి రేటు 12.9 శాతంగా ఉంటే జాతీయ జీడీపీ సగటు వృద్ధి రేటు 10.3 శాతంగా ఉందని వివరించింది.