విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ వ్యాప్తంగా వలస వెళ్తున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ‘డిసెంబర్ 18 అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం’ గా జరుపుకుంటున్నారు.
వలస అంటే… బతుకు దెరువు కోసం లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు’ గా భావించవచ్చు. వలసల వల్ల ఆటంకాలు ఎదురైనా కూడా అభివృద్ధి, మానవ వికాసం జరిగే అవకాశం ఉంది. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తున్నది. వలసలు లేకుండా ప్రపంచ అభివృద్ధి లేదేమో అనిపిస్తుంది. వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వలస అనేది వెళ్లేలా నెట్టివేయబడే పరిస్థితులు కొన్నైతే, ఉన్నచోట పరిస్థితులు అనుకూలంగా లేక మరొక చోట ఆకర్షణీయంగా ఉండడం మరొక కారణం. పేదరికం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణమైతే, అధిక వేతనాలు, మెరుగైన జీవనం, ఇతర ప్రాంతాల్లోని అనుకూల పరిస్థితులు వలస వెళ్లడానికి మరొక కారణంగా చెప్పవచ్చు.
పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వలస వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు, దేశాలకు వెళ్లేవారు కొందరు, మరింత మెరుగైన జీవితం కోసం, అధిక సంపాదన కోసం వెళ్లేవారు మరికొందరు. కొన్ని మిలియన్ల వలసదారులు చేసిన సహకారాన్ని గుర్తుంచుకొని వారిని గౌరవించుకోవలసిన అవసరం ఉంది. వలసదారుల వల్ల సమాజానికి కలిగే ప్రయోజనం ప్రజలకు తెలిస్తే, వలసదారులను గౌరవిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. ఈ చొరవపై ఆధారపడి డిసెంబర్ 18 వలస హక్కుల అంతర్జాతీయ, వలసదారుల హక్కులపై అంతర్జాతీయ వలస దినోత్సవం ఐక్యరాజ్యసమితి ప్రకటన ఒక ముఖ్యమైన దశగా భావించవచ్చు. ఇది వలసదారుల రక్షణకు సంబంధించిన వారందరికీ ఉపయుక్తంగా ఉంది.
మానవ హక్కులు, వలసదారుల ప్రాథమిక స్వేచ్ఛపై సమాచారాన్ని వ్యాప్తి చేయడం, అనుభవాలను పంచుకోవడం, వలసదారుల రక్షణను నిర్ధారించడానికి చర్యలు చేపట్టడం ద్వారా, ఈ రోజుకు గౌరవం ఇవ్వవచ్చునని చాలా దేశాలు దీనిని ఆమోదించాయి. ఇంకా ఆమోదించని దేశాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం రోజు ప్రతి దేశంలోని వలసదారులను గుర్తించి వారి సేవలను అభినందిస్తూ, వారికి ఉన్న ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలుగనీయమనే ధైర్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. వారికి గౌరవాన్ని కల్పించడం వల్ల వారి సేవతో దేశాభివృద్ధి జరుగుతున్న విషయం మరిచిపోవద్దు. ప్రవాసులకు అన్ని విధాలుగా రాయితీలు కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తే అనతి కాలంలో అభివృద్ధిని సాధించవచ్చు. ప్రపంచమంతా కలసి ఒక యూనిట్ గా మారుతున్న తరుణంలో వలస అనేది నిరంతరం జరిగే ప్రక్రియగా మనం భావించవచ్చు.
గత చరిత్రను పరిశీలన చేస్తే కారణం ఏదైనా వలస అనేది సాధారణం అనే విషయం మనకు అర్థమవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో స్వస్థలాల నుంచి వేరే చోటికి తరలివెళ్లే వారి సంఖ్య 45.5 కోట్లు. ఇది క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం దాదాపు కోటి 40 లక్షల మంది ఒక చోటు నుండి మరో చోటుకు వలసలు చోటుచేసుకుంటున్నాయని లెక్కలు తెలుపుతున్నాయి.1979లో అంతర్ రాష్ట్ర వలస కార్మిక చట్టం వచ్చింది. వేతనాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు మెరుగుపరచడం, శ్రమ దోపిడీని నిరోధించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. చట్టం ఉన్నప్పటికీ అమలు అనేది పగడ్బందీగా జరగాలికదా. ప్రపంచ వ్యాప్తంగా 130కి పైగా దేశాలలో మూడు కోట్ల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారని ఒక అంచనా. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశా ల్లో పెట్రోల్ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది.
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులు తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా చూస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జైలుపాలు అవుతున్న వారిని ఆదుకోవడంలో వెనుకబడి వున్నాం. ప్రమాదవశాత్తు మరణించిన వలసదారుని మృతదేహం సొంత గ్రామానికి చేర్చడం అనేది ఇప్పుడు కష్టంగా ఉంది. కుటుంబాన్ని వదిలి పొట్టకూటి కోసం వెళ్లిన వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వాలు, ఇక్కడి ప్రభుత్వాలు అండగా ఉండి జరగరాని ఘోరం ఏదైనా జరిగితే వెంటనే తగు చర్యలు తీసుకొని లబ్ధి చేకూర్చవలసిన బాధ్యత ఇరు దేశాల ప్రభుత్వాలపై ఉంది. ఒకప్పుడు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి మాత్రమే వలస వెళ్ళేవారు.
కానీ నేడు గ్రామాలను దాటి ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వలసపోవడం అనేది సర్వసాధారణం అయిందని మనం చూస్తున్నాం. ప్రవాసులుగా వెళ్లినవారి ఇప్పుడిప్పుడే వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా కొంతమంది అడుగుపెట్టి విజయాలు సాధించిన సందర్భాన్ని మనం గుర్తించవచ్చు. తమ ఉనికిని కాపాడుకుంటూ, మాతృదేశంపై మమకారం చూపుతూ మరెందరికో సహకారాన్ని అందిస్తున్న.. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అనే మాటను నిజం చేయాల్సిన బాధ్యత కూడా ప్రవాసుల మీద వుంది.
(నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం)
గడప రఘుపతిరావు
99634 99282