షాంఘై: హువావే చైర్మన్ రెన్ ఝెంగ్ ముద్దుల తనయ, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఓ) మెంగ్ వాంగ్‌జౌకు మూడేళ్ల తర్వాత విముక్తి లభించింది. బెయిల్ లభించిన వెంటనే విమానంలో బయలుదేరి చైనాలోని షాంఘై చేరుకుంది. మూడేళ్ల సుదీర్ఘ జైలు తర్వాత ఆమె చైనాకు రావడం ఇదే మొదటిసారి. 2018 డిసెంబర్ 1న కెనడాలోని వాంకోవర్ వెళ్లిన ఆమెను అమెరికా ఒత్తిడి కెనడా పోలీసులు అరెస్టు చేశారు.ఆ తర్వాత వాంకోవర్ కోర్టు ఆమెను హౌస్ అరెస్టులో ఉంచాలని ఆదేశించింది. అంతటితో ఆగక అమెరికా .. మెంగ్ వాంగ్‌జౌను తమకు అప్పగించాలని కెనడాపై ఒత్తిడి తెచ్చింది. దీనికి ప్రతిగా మాజీ కెనడా దౌత్యవేత్త మిచెల్ కోవ్‌రిగ్, వ్యాపారవేత్త మిచెల్ స్పావోర్‌లను బంధిస్తున్నట్లు చైనాప్రకటించింది దీంతో చైనా, కెనడా, అమెరికాల మధ్య సంప్రదింపులు జరిగాయి. చివరకు మెంగ్ వాంగ్‌జౌపై అభియోగాలను ఉపసంహరించుకొంటున్నట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రకటించారు. వెంటనే వాంకోవర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కాగా చైనా వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులు మిచెల్ కోవ్‌రిగ్, స్పావోర్‌లు చైనానుంచి కెనడాకు బయలుదేరారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.