13 VN 05
కొత్త మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు
నాలుగు రోజులకు 2,858 దరఖాస్తులు
దరఖాస్తు ఫీజు రూపంలో ఈసారి రూ.1200 కోట్లు వచ్చే అవకాశం
ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తులకు చివరితేదీ
60 నుంచి 70 వేల దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ అధికారుల అంచనా !
హైదరాబాద్: కొత్త మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గత సంవత్సరం 2,216 మద్యం దుకాణాలకు గాను సుమారుగా 49 వేల దరఖాస్తులు రాగా ఈసారి ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి. మద్యం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి నాలుగు రోజులు కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. అందులో అధికంగా ఇప్పటివరకు ఖమ్మం, మేడ్చల్, శంషాబాద్‌ల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాల (మొత్తం 756) దుకాణాలను ఎక్సైజ్ శాఖ కేటాయించగా వాటిని కలుపుకొని శనివారం వరకు 2,858 దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈనెల 20న డ్రా ద్వారా మద్యం షాపులను ఎక్సైజ్‌శాఖ కేటాయించనుండగా, గతం కంటే ఈసారి (404) దుకాణాలు పెరగ్గా మొత్తం 2,620 మద్యం షాపులకు ఈనెల 18వ తేదీ వరకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మద్యం షాపులను దక్కించుకోవడానికి ఈ సారి సుమారుగా 60 నుంచి 70 వేల దరఖాస్తులు వచ్చే అవకాశంతో పాటు వీటి ద్వారా ఆదాయం రూ. 1,200 కోట్లు రావచ్చని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈసారి ఒకవ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ పేర్కొనడంతో భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌శాఖకు అందిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాంతాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా….
ఆదిలాబాద్ నుంచి (16) దరఖాస్తులు రాగా, ఆసిఫాబాద్ (23), మంచిర్యాల (08), నిర్మల్ (11), హైదరాబాద్ (145), సికింద్రాబాద్ (110),
జగిత్యాల (20), కరీంనగర్ (28), పెద్దపల్లి (17), సిరిసిల్ల (07), ఖమ్మం (380), కొత్తగూడెం (191), గద్వాల్ (76), మహబూబ్‌నగర్ (26),
నాగర్‌కర్నూల్ (27), వనపర్తి (18), మెదక్ (64), సంగారెడ్డి (101), సిద్ధిపేట (82), నల్లగొండ (189), సూర్యాపేట (52), భువనగిరి (19),
కామారెడ్డి (57), నిజామాబాద్ (38), మల్కాజిగిరి (175), మేడ్చల్ (363), సరూర్‌నగర్ (76), శంషాబాద్ (338), వికారాబాద్ (18), జనగాం (40), భూపాలపల్లి (18), మహబూబాబాద్ (20), వరంగల్ రూరల్ (49), వరంగల్ అర్భన్ (51) నుంచి మొత్తం 2,858 దరఖాస్తులు వచ్చాయి.