Monday, January 20, 2025

గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్, డిసిపిలు, ఎడిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లతో కలిసి బుధవారం నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఇ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లను పరిశీలించాలని అన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, అందరూ సమిష్టిగా పనిచేయాలని అన్నారు.

ఆయా ప్రాంతాల్లోని పౌర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతవరణంలో వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. సీసీటీవీలపై దృష్టి సారించాలని, పనిచేయని వాటిని వెంటనే మరమ్మతు చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. మండపాల్లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు చెప్పాలని అన్నారు. గణేష్ మండపంలో రోజంతా కనీసం ఒక వాలంటీర్ తప్పనిసరిగా ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలని, మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ మండపం నిర్వాహకుల కమిటీ వివరాలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొవాలని ఆదేశించారు. ప్రతి గణేష్ మండపం దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని తెలిపారు.

వినాయక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ప్రజలు గణేశ్ ఉత్సవాలను ఘనంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. సోషల్ మీడియా తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామని.. తప్పుడు వదంతులు వ్యాప్తి చేసే వారి మీద చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన పోలీసులతో బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు, స్విమర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని, అందరు కలిసి నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

అదేవిధంగా రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా జిహెచ్‌ఎంసి అధికారుల సమన్వయంతో ముందుగానే చెరువులు, ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్ లైట్లను, బారికేడ్లను నిర్మించాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలన్నారు. ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చేపట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News