Friday, November 22, 2024

కాంగ్రెస్ ‘జనగర్జన’ సభకు భారీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూలై 2న తెలంగాణ జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు సుమారు ఐదు లక్షల మందిని సమీకరించాలని టిపిసిసి నిర్ణయించిన నేపధ్యంలో అందుకు అనువైన మైదానాన్ని ఎంపిక చేసి చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగర శివారులో ఎస్‌ఆర్ గార్డెన్ వెనుక భాగంలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన దాదాపు వంద ఎకరాల ఖాళీ స్థలాన్ని ఈ బహిరంగ సభకు ఎంచుకున్నారు. ఈ స్థలంలోనే గతంలో పొంగులేటి కుమారుడి వివాహం, కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమాలు జరిగాయి.

ఈ సభా వేధికపైనే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఈ సభను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది జనవరి 18న బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ నూతన కలెక్టరేట్ భవనానికి సమీపంలోని ఖాళీ స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి దీటుగా కాంగ్రెస్ నేతలు ఈ సభను నిర్వహించాలని భావిస్తూ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో ఈ ఏడాది మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించిన పాదయాత్ర ముగింపు సభ కూడా ఖమ్మంలోనే ఏర్పాటు చేశారు. మూడు నెలల క్రితమే పాదయాత్ర ఖమ్మంలోనే ముగిస్తామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే అనుకోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకొని ఈనెల26న ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసొచ్చిన విషయం తెలిసిందే. ముందుగా భట్టి పాదయాత్ర ముగింపు సభ, పొంగులేటి చేరిక సభలను వేర్వేరుగా వేర్వేరు తేదీల్లో ఖమ్మం నగరంలోనే ఏర్పాటు చేసి ఆ రెండు సభలకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీలను రప్పించాలని భావించారు.

అయితే స్వల్ప తేడాతో ఒకే జిల్లాలో ఏఐసిసి అగ్ర నేతలు పర్యటించడం కుదరదని భావించి రెండు కార్యక్రమాలను ఒకే తేదీలో నిర్వహించాలని ఏఐసిసి అదేశించిన నేపథ్యంలో జూలై 2న అటు భట్టి పాదయాత్ర ముగింపు సభ, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీం కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమాలు ఒకే వేధికపైనే నిర్వహించాలని ఏఐసిసి నిర్ణయించింది. ఈ సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన అధికారికంగా ఖారారైంది. అయితే భట్టి తన పాదయాత్ర ముగింపు సభను ఖమ్మం నగరంలోనే వేరే చోట పెట్టుకోవాలని ముందుగా భావించినప్పటికీ తప్పని పరిస్థితిలో ఏఐసిసి ఆదేశాల మేరకు ఒకే వేధికను పంచుకోక తప్పడంలేదు. దీంతో ఈ సభను విజయవంతం చేసేందుకు అటు జిల్లా కాంగ్రెస్ పార్టీ, ఇటు పొంగులేటి బృందం విస్తృతంగా కృషి చేస్తుంది.

ఈ సభ విజయవంతంతో తన బలం ఏమిటో నిరూపించుకోవాలని పొంగులేటి బృంధం భావిస్తుండగా సిఎల్‌పి నేత భట్టి సత్తా ఏమిటో ఈ సభ ద్వారా చాటాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. రెండు కార్యక్రమాలు ఒకే వేధికపై నిర్వహించాలనే విషయంలో ఇరువర్గాల మధ్య సమన్వయం లోపించే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏఐసిసి కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణిక్ రావు ఠాక్రే బుధవారం ఖమ్మంకు చేరుకొని అటు భట్టితో ఇటు పొంగులేటితో మాట్లాడి ఇరువురిని సమన్వయపరిచి ఒకే వేధికపై రెండు కార్యక్రమాలను చేపట్టే విధంగా ఒప్పించారు. ఈ రెండు కార్యక్రమాలను సమన్వయంచేసే బాధ్యతలను కూడా పిసిసి ఉపాధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్‌కు అప్పగించారు.

  • 100 ఎకరాల్లో బహిరంగ సభ

100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ జరగనుంది. ఇందులో 40 ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరుగుతుండగా, మరో 60 ఎకరాల స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. సుమారు ఐదు లక్షల జనం హాజరయ్యే ఈ సభకు ఆ దిశగా ఏర్పా ట్లు చేస్తున్నారు. బారికేడ్లు, షామియాలు, కూర్చీలు, సౌండ్ సిస్టమ్ ఇతరాత్రా ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున్న కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించింది. పొంగులేటి టీమ్ మాత్రం ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు మహబుబ్ బాద్, ములుగు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున్న తన అభిమానులను, అనుచరులను రప్పించేందుకు కసరత్తులను ప్రారంభించారు. ఈ సభ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే బుధవారం పరిశీలించి వెళ్లిన విషయం తెలిసిందే. సభ నిర్వాహణపై సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్కకు దిశదశ నిర్దేశించిన తరువాత సభా స్థలికి చేరుకొని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • కిటకిటలాడుతున్న పొంగులేటి నివాసం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో పొంగులేటి నివాస గృహం కిటకిటలాడుతుంది ఉమ్మడి జిల్లాకు చెందిన కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ధ ఎత్తున్న పొంగులేటిని కలిసి అభినందనలు తెలిపి స్వాగతిస్తున్నారు. గురువారం మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ తోపాటు సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులంతా పొంగులేటిని కలిశారు. ఈ విధంగా అన్ని సెగ్మెంట్లకు చెందినకాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు పొంగులేటిని కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు. మున్నూరుకాపు సంఘానికి చెందిన ముఖ్యనాయకుడు శేట్టి రంగరావు, వర్తక సంఘం ప్రతినిధులు గోపాల రావు, తుమూలూరి లక్ష్మినర్సింహ్మరావు తదితరులు పొంగులేటిని కలిసి మద్దతు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News