భారీ భద్రత ఏర్పాటు చేశాం, మాస్కు పెట్టుకోవాల్సిందే
నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళీ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ దేవాలయంలో మంగళవారం ఆయన కమిటీ సభ్యులు, పోలీసులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి అంజనీకుమార్ మాట్లాడుతూ బోనాలకు వచ్చే వారి కోసం ఐదు ఉంచి ఏడు కిలో మీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు మొదలవుతాయని తెలిపారు. బారీకేడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని కోరారు. నగర పోలీసులు కష్టపడి పనిచేసి బోనాలను విజయవంతం చేయాలని, బందోబస్తు విధులు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. బోనాలకు ఎక్కువగా మహిళా భక్తులు వస్తారని అందుకే ఎక్కువ మంది ఉమెన్ పోలీసులను విధుల్లో నియమించామని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను కేటాయించామని తెలిపారు. ఆలయ కమిటీ విఐపి పాస్‌లు ఇచ్చే సమయంలో వారికి నిర్ధిష్ట సమయం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనరులు అనిల్‌కుమార్, శిఖాగోయల్, డిఎస్ చౌహాన్, డిసిపి కల్మేశ్వర్, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.