Sunday, January 19, 2025

విశ్వంలో మరో అత్యద్భుతం

- Advertisement -
- Advertisement -

లండన్ : ఖగోళాంతర్గత విశ్వంలో ఇప్పుడు మరో అత్యద్భుతం గోచరించింది . అత్యంత భారీ పరిమాణంలో ఉన్న ఈ ఉంగరం వంటి జగజగ్జేయమాన కాంతుల బిగ్‌రింగ్ ఏమిటనేది అంతుచిక్కని విధంగా మారింది. భారీ ద్రవ్యరాశితో నెలకొని ఉన్న ఈ రింగ్ విశ్వంలో రాత్రివేళలో దాదాపు 15 నిండుపున్నముల చంద్రుల స్థాయి వెలుగులు విరజిమ్ముతోందని ఖగోళశాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ భారీ రింగ్ ఉనికి ఇప్పుడు ఇప్పటివరకూ ఉన్న విశ్వ పరిణామ క్రమపు సిద్ధాంతాలకు పలు ప్రశ్నలను, పెను సవాళ్లను విసిరింది. న్యూ ఓర్లియాన్స్‌లోని జరిగిన 243వ అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సమావేశంలో శాస్త్రజ్ఞులు ఈ బిగ్‌రింగ్ ఉనికిని తీసుకువచ్చారు. కాస్మోస్‌పై ఇప్పటివరకూ మనకు ఉన్న పలు ఆలోచనలు, స్థిరీకృత విశ్లేషణలు ఇప్పటి ఈ వినూత్న వెలుగుతో పటాపంచలు అవుతాయని , ఇటువంటి అత్యంత భారీ స్థాయి విశ్వ ఖగోళ పదార్థం ఉంటుందని ఇంతవరకూ ఊహలలో కూడా ఆలోచన లేదని ఓ పరిశోధకుడు తెలిపారు.

ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బిగ్ రింగ్ విశ్వంలో నిజంగానే ఓ భారీ బ్రహ్మండ స్థాయి కాస్మిక్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం మాదిరిగా ఉందని తేల్చారు. రెండేళ్ల క్రితమే దీనిని గుర్తించారు. అయితే పలు పరిశోధనలు, విశ్లేషణల తరువాత దీని ఉనికిని నిర్థారించుకుని ఇది నిజంగా ఉన్న కోటానుకోట్లాది కాంతిపుంజాల ఖండం వంటిది అని తెలిపారు. మొత్తం ఖగోళ వ్యవస్థకు ఇది మూలం అయి ఉంటుందని సిద్ధాంతకర్తలు చెపుతున్నారు. ఈ భారీ రింగ్ విస్తారితంగా దాదాపు 1.3 బిలియన్ కాంతిసంవత్సరాల వ్యాసార్థంలో ఉంది. భూమికి దాదాపు 9 బిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో నెలకొని ఉంది. కళ్లతోనే కాదు, సాధారణ టెలీస్కోప్‌లతో కూడా దీనిని చూడటం అసాధ్యం, ఎందుకు అంటే ఇది దట్టమైన చంద్రకాంతులను తలపించే విధంగా ఉంటుంది. ఇప్పుడు విశ్వాంతరాలలో నెలకొని ఉన్న ఈ దివ్యకాంతుల బ్రహ్మపదార్థపు ఉంగరంలోనే ఈ విశ్వం పరిణామ క్రమపు రహస్యాలు దాగి ఉన్నాయా? దీనిని ఛేదించేందుకు ప్రయోగాలు ఆరంభమవుతాయా ? అనేది ఇప్పుడు విశ్లేషణలకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News