Sunday, December 22, 2024

డిజిటల్ యూనివర్శిటీ ఆవశ్యకత

- Advertisement -
- Advertisement -

విద్యా బోధన ఎన్నో రకాలు, ఆ బోధనకు ఎన్నో మార్గాలు. విద్యార్థులు, గురువులు ప్రత్యక్షంగా ఒకరి సమక్షంలో ఒకరుండి చదువు నేర్పడం, నేర్చుకోవడం సాంప్రదాయిక విధానం. అయితే వివిధ కారణాల వల్ల అందరికీ అది సాధ్య పడక పోవచ్చు . పాఠశాలలు అంతటా అందుబాటులో ఉన్నా కాలేజీలు పట్టణాలకు, యూనివర్శిటీలు నగరాలకే పరిమితం. తగిన ఆర్థిక స్తోమత ఉంటే తప్ప పైచదువులు అందుకోలేరు. 2021-22 విద్యా సంవత్సరంలో మన దేశంలో పదవ తరగతి తర్వాత 35 లక్షల మంది పైచదువులకు వెళ్లలేకపోయారని స్కూల్ ఎడ్యుకేషన్ డేటాలో ఉంది. పదవ తరగతి చదివిన విద్యార్థుల్లో వీరు 20% ఉంటారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ సంఖ్య ఒడిశా, బీహార్‌లలో 40% పైగా ఉంటే, కర్ణాటక, ఎపి, తెలంగాణలో 27% ఉంది. ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ కొరవడితే రాబోయే కాలంలో యువత దేశానికి భారంగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అందుకే నూతన జాతీయ విధానం ద్వారా 2030 నాటికి ఈ సంఖ్యను వీలైనంత తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం విద్యా విధానంలో భారీ మార్పులు అవసరం.

విద్యా వ్యాప్తికి ప్రత్యక్ష బోధన సాధ్యం కాని చోట 1980 లలో దూర విద్య ప్రవేశించి డ్రాప్‌అవుట్‌ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఓపెన్ స్కూళ్ళు, యూనివర్శిటీల కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా ఎందరో ఉన్నత విద్యను అందుకుంటున్నారు. పనులు చేసుకుంటూ ఇంటి వద్ద నుండే వీటిలో ప్రవేశం పొంది వివిధ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినవారు, పదోన్నతి పొందినవారు ఎందరో ఉన్నారు. అయితే స్టడీ మెటీరియల్ పోస్టు ద్వారా తెప్పించుకోవటం, అప్పుడప్పుడు కాంటాక్ట్ క్లాసులు హాజరుకావడం, నియమిత కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయడం జరుగుతోంది. ఎక్కడికి కదలకుండా ఉన్నచోట నుండే ఉన్నత చదువులు పూర్తి చేసే సౌకర్యం ఈ సాంకేతిక విప్లవం కాలంలో సాధ్యపడుతుంది. ఈ విధానానికి డిజిటల్ యూనివర్శిటీలు తోడ్పడుతాయి. ఇది డిజిటల్ యుగం. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండి వీలైనంత తక్కువ ధరలో కంప్యూటర్ టాబ్ కొనగలిగితే కొండల్లో, కోనల్లో ఉన్నా ఎంటెక్ లాంటి ఉన్నత సాంకేతిక విద్య కూడా ఈ రోజుల్లో సాధించవచ్చు.

మన కేంద్ర ప్రభుత్వం పోయిన బడ్జెట్‌లోనే కేంద్రీయ డిజిటల్ విశ్వవిద్యాలయం కోసం రూ. 4 కోట్లు కేటాయించింది. ఆ మొత్తంతో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాజా బడ్జెట్‌లో రూ. 100 కోట్లు నేషనల్ డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటుకు అందిస్తోంది. పార్లమెంట్‌లో యాక్ట్ ద్వారా కేంద్రం జాతీయ డిజిటల్ వర్శిటీని నెలకొల్పాలి. అప్పుడే ఆ యూనివర్శిటీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాదిలో ఇది సాధ్యపడవచ్చు. డిజిటల్ యూనివర్శిటీలో కోర్సుల నిర్వహణ, విద్యా బోధన, పరీక్షలు అన్ని డిజిటల్ మాధ్యమంలోనే జరుగుతాయి. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా వర్చువల్ మోడ్‌లో సర్వం సాధ్యపడుతుంది. హబ్ అండ్ స్పోక్స్ దీనికి మూలాధారం. హబ్ అంటే నిర్వహణ కేంద్రం, స్పోక్స్ అంటే ఈ వ్యవస్థను సమన్వయ పరిచే విద్యా సంస్థలు.

కేంద్ర విద్యా శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఇది ఏర్పాటవుతుంది. దేశంలో విశ్వవిద్యాలయాలకు పెద్ద అయిన యుజిసి ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని ఆన్‌లైన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ను ఆధునీకరించాలనే సంకల్పం యుజిసికి ఉంది. ఆ సంస్థ ముందుకొచ్చిందంటే డిజిటల్ చదువుకు అన్ని రకాల గుర్తింపు లభించినట్లే. ఇప్పటికే దేశ పౌరులకు వివిధ సేవలు అందిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ వ్యవస్థను అనుసంధానం చేస్తారు. ఈ కోర్సుల్లో చేరడానికి కనీస విద్యార్హత ఉంటే చాలు. ప్రవేశానికి ఎలాంటి ఎంట్రన్స్ పరీక్షలు ఉండవు. కోర్సు పూర్తికి నిర్ణీత గడువు కాలం ఉండదు. భాషా మార్పు సాంకేతికత అందుబాటులో ఉన్నందున ప్రాంతీయ, మాతృభాషల్లో బోధనను పొందవచ్చు. ఫీజులు తక్కువగా ఉంటాయి. పైగా ఈఎం ఐ విధానంలో కిస్తులుగా చెల్లించే సదుపాయం కల్పిస్తున్నారు.

ముందుగా దేశంలోని ర్యాంకింగ్ ఫ్రెమ్ వర్క్‌లో, న్యాక్ గ్రేడింగ్‌లో వందలోపు రేటింగ్ వచ్చిన విద్యా సంస్థలను యుజిసి ఎంపిక చేసి అందులోని బోధనను, కోర్సులను డి యు విద్యార్థులకు అందే ఏర్పాట్లు చేస్తుంది. దీని ద్వారా ఒక గొప్ప విద్యా సంస్థలో అడ్మిషన్ లభించకున్నా అదే కోర్సును డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా పూర్తి చేయవచ్చు. డిజిటల్ యూనివర్శిటీ కోసం యుజిసి కేవలం టాప్ కాలేజీలను ఎంపిక చేస్తున్నందువల్ల ఆయా క్లాసుల్లో విద్యార్థులు వినే లెక్చర్లు వీరికి లభిస్తాయి. తద్వారా డియులో అవే కోర్సుల్లో చేరి ఎంతో మంది నిష్ణాతులు, నిపుణులుగా తయారయ్యే అవకాశం ఉంది. యువతలో నైపుణ్య లేమి అంతరించి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగితను గణనీయ స్థాయిలో తగ్గించవచ్చు. దేశంలోకి వస్తున్న ప్రపంచ స్థాయి కంపెనీల మానవ వనరుల అవసరాన్ని తీర్చే స్థాయికి యువత ఎదిగే అవకాశం ఉంది. విశాలమైన మన దేశంలో గ్రామీణ ప్రాంతమే ఎక్కువ. పేదరికం వల్ల, రవాణా సౌలభ్యం లేనందువల్ల ఏ మూలాన ఏ ప్రతిభ ఉందో తెలియదు.

అన్ని ప్రాంతాల శక్తిసామర్థ్యాలు బయటకు రావడం ఇప్పటి అవసరం. ఇది డిజిటల్ చదువు వల్లే సాధ్యపడుతుంది. డిజిటల్ యూనివర్శిటీకి కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం కావడం ముఖ్యావసరం. దేశంలో 90 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నా భౌగోళికంగా 52% ప్రాంతానికి మాత్రమే ఆ సౌకర్యం లభిస్తోంది. ఇది మరింత విస్తరించవలసి అవసరం ఈ విద్యా విధాన విజయంతో ముడిపడి ఉంది. బ్రాడ్ బాండ్ శక్తి కూడా పెరిగి నెట్ వేగవంతం కావాలి. ఈ దిశగా కూడా ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేసి సమాచార ఛత్రాన్ని విస్తరింపజేసి ఈ చదువుకు తోడ్పడాలి.
ప్రస్తుతం మన దేశంలో రెండు రాష్ట్రాల్లో డిజిటల్ యూనివర్శిటీలు ఉన్నాయి. డియు యాక్ట్ ద్వారా కేరళలో 2020లో ఒకటి ఏర్పాటైంది. దీనిలో 3 ఎంటెక్, 5 ఎంఎస్‌సి, 2 ఎంబిఎ కోర్సులు ఉన్నాయి. 2022లో రాజస్థాన్ ప్రభుత్వం జోధ్ పూర్‌లో రాజీవ్ గాంధీ ఫిన్‌టెక్ డిజిటల్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించింది. కేంద్రం నిర్వహణలో ఏర్పడే జాతీయ డిజిటల్ యూనివర్శిటీకే జాతి అవసరాలను తీర్చే స్తోమత ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News