వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమం లోనే దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అబార్షన్ మాత్రల కోసం భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క రోజులోనే వీటి కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు రావడం గమనార్హం. ఈమేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ అధికారం లోకి వస్తే గర్భవిచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారంటూ వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు భారీగా పెరిగినట్టు సంబంధిత వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక వీటికి డిమాండ్ పెరిగింది. 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయని, ఇది రోజూ ఉండే డిమాండ్ కంటే 17 రెట్లు ఎక్కువని కథనాలు పేర్కొన్నాయి.
గర్భిణులు కానివారు సైతం ప్రిస్క్రిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీవో వెల్లడించింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణులు కానివారేనని తెలిపింది. ఎన్నికలకు ముందు గర్భవిచ్ఛిత్తి మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అన్న సమాచారం కోసం నిత్యం 4000 నుంచి 4500 వరకు తమ వెబ్‌సైట్ చూసేవారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక అలా చూసేవారి సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తోందని మరో స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఒక్క రోజులోనే 82 వేల మందికి పైగా వెబ్‌సైట్‌ను చూస్తున్నారని, దీంతోపాటు గర్భనిరోధక పరికరాలు, వేసక్టమీ శస్త్ర చికిత్సలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.