Sunday, January 12, 2025

విద్యార్హతల కన్నా నైపుణ్యమే మిన్న

- Advertisement -
- Advertisement -

దేశంలో రానున్న ఐదేళ్లలో ఉద్యోగాల స్వరూపమే అనూహ్యంగా మారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు డిగ్రీలుంటేకానీ సరైన ఉద్యోగాలు రాని పరిస్థితి ఉండగా, ఇప్పుడు సాంకేతిక నైపుణ్యం ముందు డిగ్రీలు చిన్నబోతున్నాయి.దేశంలో ఎఐ(కృత్రిమ మేధ) నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచ స్థాయిలో 88% వరకు ఎఐ ప్రోగ్రాములు అమలవుతుండగా, భారతీయ సంస్థలు 96% వరకు ఎఐ ప్రోగ్రాములు అమలు చేస్తున్నాయి. ఉత్పాదక ఆధారిత ఎఐ శిక్షణ నమోదులో అమెరికా, భారత్ దేశాలు ముందుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది.

జనరల్ ఎఐ శిక్షణను పెంచడంలో కార్పొరేట్ సంస్థలు ముందుంటున్నాయి. ఈ కార్పొరేట్ సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా 14 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. జనరల్ ఎఐ వినియోగం ప్రస్తుతం అన్ని రంగాల్లో పెరుగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని సరికొత్త చిత్రాలు, పాఠ్యాంశాలు, సంగీతం తదితర అంశాలను సృజించే వ్యవస్థలను జనరేటివ్ ఎఐగా వ్యవహరిస్తున్నారు.గత ఐదేళ్లలో ప్రపంచస్థాయిలో జనరేటివ్ ఎఐపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. 2019లో 88.2 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టగా, 2020లో 218 కోట్ల డాలర్లు, 2021లో 417 కోట్ల డాలర్లు, 2022 లో 264 కోట్ల డాలర్లు, 2023లో 2243 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెరిగాయి. ఎఐ నైపుణ్యానికి సంబంధించి దేశంలో 67% కంపెనీలు కొత్త విభిన్న నైపుణ్య ప్రతిభపై దృష్టి సారిస్తున్నాయి. 30% కంపెనీలు డిగ్రీ షరతులను తొలగించి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2030 నాటికి దేశంలో 17 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడగా, మరోవైపు 9.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, అలాగే ప్రపంచంలో 170 మిలియన్ కొత్త ఉద్యోగాలు సృష్టించబడగా, 92 మిలియన్ ఉద్యోగాలు కోల్పోవడమవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్లుఇఎఫ్) నివేదిక వెల్లడించింది.

కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయ కంపెనీలు ప్రపంచాన్ని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎఐ, రోబోటిక్స్, ఎనర్జీ టెక్నాలజీ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. 35% భారతీయ కంపెనీలు సెమీకండక్టర్లు, కంప్యూటింగ్ టెక్నాలజీ, తమ వ్యాపారాన్ని పూర్తిగా మార్చగలవని విశ్వసిస్తున్నాయి. 21శాతం కంపెనీలు క్యాంటం, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీలే ముఖ్యమైనవిగా భావిస్తున్నాయి. దేశంలో బిగ్‌డేటా, ఎఐ, మెషిన్‌లెర్నింగ్, సైబర్ నిర్వహణ వంటి ఉద్యోగాలు దేశంలో వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత దేశంలోని ఐటి రంగం ప్రస్తుతం 5.4 మిలియన్ మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. 2030 నాటికి ఈ సంఖ్యను 10 మిలియన్ వరకు రెట్టింపు చేయాలన్న టార్గెట్ ఉండగా, కేవలం 7.5 మిలియన్ వరకే సాధించగలమని ఆయా రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఎఐ విస్తరించడం వల్ల ఇప్పుడున్న ఉద్యోగాలు పోతాయన్న భయం వెంటాడుతుండడమే.ఐటి రంగం ఏటా 58 శాతం వరకు నిదానంగా వృద్ధి చెందుతుందని, 2027 సంవత్సరం నాటికి 6.2 మిలియన్ నుంచి 6.8 మిలియన్ ఉద్యోగాలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వృద్ధి అంతా డిజిటల్ సాంకేతికత వైపు దూసుకెళ్తోంది. ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్ తదితర సాంకేతిక ప్రక్రియలు పారిశ్రామిక, వాణిజ్య సంస్థల ప్రోత్సాహంతో విస్తరిస్తున్నాయి.

ఇది వరకటి 10 మిలియన్ ఉద్యోగాల టార్గెట్‌ను 7.5 మిలియన్ ఉద్యోగాలకు సవరించినప్పటికీ, ఉద్యోగాల రాశి కన్నా నైపుణ్యం, నాణ్యతలకు పట్టం కడుతున్నారు. ఎఐ, ఆటోమేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉద్యోగాల నియామక ప్రక్రియలను క్రమబద్ధం చేస్తున్నాయి. ఈ మార్పులు, అత్యంత విలువైన సాంకేతిక సేవలు, నూతన ఆవిష్కరణల వైపు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ఆధునిక సాంకేతిక నైపుణ్య ప్రక్రియలను అందిపుచ్చుకోగలిగితేనే ఇప్పుడు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ మేరకు ఉద్యోగ అవకాశాలు 80% వరకు సాంకేతిక నిపుణులతో 2025 26 నాటికి 20% వరకు పెరుగుతాయని ఐటి రంగ వర్గాలు పేర్కొంటున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతికతల వల్ల 2030 నాటికి దేశంలో 150 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక ప్రయోజనం సిద్ధిస్తుందని అంచనా వేస్తున్నారు. జనరేటివ్ ఎఐ వంటి సాంకేతికతలే ఐటి రంగంలో 2030 నాటికి రెండు మిలియన్ల వరకు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయని నివేదికల వల్ల తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం 1700 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జిసిసి) ఉన్నాయి. వీటి వల్ల 1.9 మిలియన్ మంది ఉద్యోగాలు పొందుతున్నారు.

2030 నాటికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల సంఖ్య 2200 వరకు చేరుకుంటుందని, వాటి ద్వారా 2.5 మిలియన్ నుంచి 2.8 మిలియన్ వరకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయని ఐటి నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అనేవి ఎదురవుతున్న సవాళ్లకు అనుగుణంగా అనేక రకాల వ్యూహాత్మక విధులను నిర్వహించడానికి బహుళజాతి సంస్థలు స్థాపించే కేంద్రాలు. ఆవిష్కరణ కార్యక్రమాలు, పరిశోధనలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పరివర్తన కార్యక్రమాలను వేగవంతం చేయడం, వనరుల వినియోగాన్ని పెంచడం తదితర విధులను ఈ కేంద్రాలు నిర్వహిస్తుంటాయి. ఐటి రంగంలో ఒప్పందం ప్రకారం ఉద్యోగులను నియమించుకునే విధానంలో 43.5% డిమాండ్‌తో బెంగళూరు కేంద్ర స్థానంగా ఉన్నప్పటికీ, 13.4% డిమాండ్‌తో రెండో అత్యధిక స్థానంలో హైదరాబాద్ ఉంది. ఈ ఉద్యోగాల కల్పనలో విద్యార్హతల కన్నా సాంకేతిక నైపుణ్యమే కీలక పాత్ర వహిస్తోందన్నది ఉద్యోగార్థులు గమనించవలసిన కీలకాంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News