Friday, January 10, 2025

మోకిల ప్లాట్లకు భారీ డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో వేలం వేయనున్న రంగారెడ్డి జిల్లా మోకిల ప్లాట్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం జరిగిన ప్రీబిడ్ సమావేశానికి 200 మందికి పైగా హాజరయ్యారు. హెచ్‌ఎండిఏ యంత్రాంగం మోకిలలో తొలిదశలో 50 ప్లాట్లను వేలం వేయాలని నిర్ణయించింది. హెచ్‌ఎండిఏ సుమారు 165.37 ఎకరాల విస్తీర్ణంలో 1,321 ప్లాట్లతో లే ఔట్‌ను రూపొందించింది. వాటిలో తొలిదశగా 50 ప్లాట్ లను హెచ్‌ఎండిఏ ఆన్‌లైన్ వేలం ప్రక్రియ ద్వారా విక్రయిస్తోంది.

అందరికీ అందుబాటులో ఉండే విధంగా మోకిల ప్లాట్ల ధరలను గజం రూ.25,000ల చొప్పున కనీస ధరగా హెచ్‌ఎండిఏ ఖరారు చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో పాల్గొని గజానికి రూ.500ల చొప్పున కోట్ చేసి ఏ1 బిడ్డర్ నిలిచి ప్లాట్లను సొంతం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మోకిల హెచ్‌ఎండిఏ లే ఔట్ పక్కన వంద (100) అడుగుల శంకరపల్లి రోడ్డు ఉండడం, కేవలం 20 నిమిషాల్లో కోకాపేట్ నియో పోలీస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట పార్క్, సిబిఐటి, ఓషియన్ పార్క్ వంటి పరిసర ప్రాంతాలకు చేరుకునేలా రోడ్లను అందంగా హెచ్‌ఎండిఏ తీర్చిదిద్దుతోంది. ‘వెస్ట్ సిటీ హబ్’ గా ఉన్న మోకిల హెచ్‌ఎండిఏ లే ఔట్‌ల ప్లాట్ కొనుగోలు కోసం స్థానికులతో పాటు స్థానికేతరులు పోటీ పడుతున్నారు.

శుక్రవారం జరిగిన ప్రీబిడ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టిసి ప్రతినిధులు తమ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా సాంకేతిక అంశాలను వివరించారు. హెచ్‌ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈఓ) బి.కిషన్ రావు మోకిల వెంచర్ ప్రాధాన్యతను, హెచ్‌ఎండిఏ చేపట్టిన మౌలిక సదుపాయాలు, అంశాల గురించి వివరించారు. హెచ్‌ఎండిఏ సెక్రటరీ పి.చంద్రయ్య మోకిల ప్రాంతానికి ఉన్న విశిష్టతను వెల్లడించారు. సమావేశంలో ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు, వారి సందేహాలకు హెచ్‌ఎండిఏ సెక్రటరీ, ఎస్టేట్ ఆఫీసర్ సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పారావు, ఎస్టేట్ మానిటరింగ్ యూనిట్ (ఈఎంయూ) శ్రీకాంత్ రెడ్డి, కీర్తి చంద్ర (అకౌంట్స్)లతో పాటు బ్యాంకర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News