Sunday, January 19, 2025

మేడారానికి పోటెత్తిన భక్తజన సందోహం

- Advertisement -
- Advertisement -

ములుగు : ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారంలో ప్రతీ రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే సమ్మక్క- సారలమ్మ వనదేవతల జాతరకు భక్తజన సందోహం పోటెత్తుతున్నారు. ఈనెల 21, 22, 23, 24 తేదీల్లో జాతర ప్రారంభం కానుండగా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ముందస్తుగా వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద ఎత్తు బంగారం, చీర, సారె, పూలు, పండ్లు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుండి ప్రైవేట్ వాహనాలలో భక్తులు భారీగా మేడారంనకు తరలివచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మేడారం జాతర నిర్వహణకు ముందుగా రూ. 75 కోట్ల నిధులు విడుదల చేసింది. జాతరలో శాశ్వత పనులు నిర్వహించాలనే దృక్పథంతో పంచాయతీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క నిధులు మరిన్ని పెంచాలని విన్నవించగా స్పందించారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదనంగా 30 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో మేడారం జాతరలో 105 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలు పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31 వరకు జాతరకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు, అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పనులు ఇంకా పూర్తి కాలేదు. పనుల నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి అధికారులను, కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అప్రమత్తం చేస్తున్నారు. పనుల విషయంలో రాజీ పడేది లేదని మంత్రి సీతక్క అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ మేడారం జాతరలో జరుగుతున్న పనులను జనవరిలో సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర పనుల విషయంలో కాంట్రాక్టర్లు ఎలాంటి రాజీ పడేది లేదని నాణ్యతతో కూడిన పనులు చేయాలని, అలా చేయని పక్షంలో కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులను సైతం ఇంటికి పంపిస్తామని తెలిపారు. కానీ వివిధ శాఖలకు సంబంధించిన పనులు ఫిబ్రవరి నెల మొదలైనా ఇంకా పూర్తి కాలేదు. తాడ్వాయి నుండి మేడారం వెళ్లే ఆర్‌అండ్‌బి రోడ్డు పనులు ఇప్పుడిప్పుడే కొనసాగుతున్నాయి.

జంపన్నవాగులో భక్తుల పుణ్యస్నానాలు…
మేడారం మహాజాతరకు ముందస్తుగా తరలి వస్తున్న భక్తులు వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునే ముందు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం జంపన్న వాగు వద్ద ఆర్‌డబ్య్లుఎస్ శాఖ ఆధ్వర్యంలో వాగులో పనులు చేపడుతోంది. వాగులోని బోరుబావులను రిపేరు చేయిస్తున్నారు, బ్యాటరీ ఆఫ్ టాప్స్ ద్వారా నీటిని ముందస్తుగానే మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సౌకర్యంతో భక్తులు నల్లాల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మంత్రి సీతక్క ప్రకటించడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం హన్మకొండ నుండి మేడారానికి ముందస్తుగా బస్సులు వేయడంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సెలవు రోజులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గత జాతర కంటే మరో 2 వేల బస్సులు పెంచనున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జిల్లా ఎస్పీ పటిష్ట చర్యలు…
మేడారం మహాజాతరకు ముందస్తుగా భక్తులు ప్రైవేట్ వాహనాలలో వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటుండగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఎప్పటికప్పుడు వాహనాల రాకపోకలపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలు నిలుపుకోవడానికి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు నిలుపుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ విషయంలో ఎలాంటి అంతరాలు కలుగకుండా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వాహనాలు రోడ్లపై నిలపకుండా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు.
జాతర సమీపిస్తున్నా పూర్తికాని పనులు…
భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చేపట్టిన పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News