తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శనివారం తిరుమల శ్రీవారిని 89,318మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.76కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరడంతో స్వామివారి సర్వదర్శనానికి సుమారు 48 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆదివారం మీడియాతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమలకు రాలేకపోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చైర్మన్ అభినందించారు.
Huge Devotees Visit Tirumala Temple