Friday, December 20, 2024

భక్తజన సంద్రం యాదాద్రి క్షేత్రం..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి ః శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భారీగా తరలివచ్చిన భక్తులతో యాదాద్రి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వరుస సెలవులతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం తరలివచ్చిన భక్తులతో యాదాద్రి కిటకిటలాడుతోంది. ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులతో స్వామి వారి క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రం, గదుల విచారణ కార్యాలయాలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణకట్ట, స్వామివారి పుష్కరిణితో పాటు కొండపైన, కొండ కింద పలు ప్రాంతాలు కిటకిటలాడాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలకు పైగా సమయం పట్టినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభిచి శ్రీస్వామి,

అమ్మవార్లకు అర్చన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. పిల్లాపాపలు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, సత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. యాదాద్రి కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి స్వామి వారిని దర్శించుకొని తరించారు. అనుబంధ ఆలయమైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగే నిత్యపూజలలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు.

స్వామి వారి నిత్య రాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య రాబడి రూ.56,65,442 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.21,80,220, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,38,800, బ్రేక్ దర్శనం ద్వారా రూ.5,30,100, వీఐపీ దర్శనం ద్వారా రూ.7,80,000, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.9,00,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,99,928 కల్యాణకట్ట ద్వారా రూ.1,50,000 తో పాటు ఆలయంలోని తదితర శాఖలు, పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుండి ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

యాదాద్రిలో వేదోక్తంగా ధనుర్మాసోత్సవాలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వేదోక్తంగా ధనుర్మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే ఆలయంలో తిరుప్పావైని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళహారతులతో మహిళా భక్తులు దర్శించుకొని అమ్మవారిని నీరాజనాలు పలికారు. ధనుర్మాస విశిష్టత, తిరుప్పావై పారాయణలను భక్తులకు అర్చకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News