యాదాద్రి ః కార్తీక మాసం మహాపుణ్యమాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండంతా భక్తులతో నిండిపోయింది. కార్తీకమాసం చివరి రోజులు కావడంతో యాదాద్రీశుడి దర్శనానికి భక్తజనులు తరలివచ్చారు. యాదాద్రీశా నమోఃనమ అంటూ తరలివచ్చిన భక్తజనులతో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం పోటెత్తింది. కార్తీకమాసం చివరి రోజులు, ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమి దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం తరలివచ్చిన భక్తులతో నారసింహుడి క్షేత్రం కిటకిటలాడింది. శివకేశవులకు నిలయమైన యాదాద్రిలో కార్తీకమాసం పరమపుణ్య మాసం కావడంతో యాదాద్రి క్షేత్రంలో శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రత పూజలను అధిక సంఖ్యలో భక్తులు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల అనంతరం స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులతో స్వామి వారి క్యూలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రం, గదుల విచారణ కార్యాలయాలు, సత్యనారాయణస్వామి వ్రత మండపం, కల్యాణకట్ట, స్వామివారి పుష్కరిణితో పాటు కొండపైన, కొండ కింద పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సర్వదర్శనానికి సుమారు 4 గంటలు గంటలకుపైగా సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు అర్చన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనానికి అనుమతించారు. పిల్లాపాపలు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన,
సత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. యాదాద్రి కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి స్వామి వారిని దర్శించుకొని తరించారు. అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగే నిత్యపూజలలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు.
భారీగా సత్యనారాయణస్వామి వ్రతాలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం భారీగా సత్యనారాయణస్వామి వ్రత పూజలను భక్తులు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే 1,594 సత్యనారాయణస్వామి వ్రత పూజలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయంలో అష్టోత్తర శత ఘటాభిషేకం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
కోటి దాటిన స్వామివారి నిత్యరాబడి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తులు భారీగా తరలిరావడంతో స్వామివారి నిత్యరాబడి రికార్డు స్థాయిలో వచ్చింది. ఆదివారం ఒక్కరోజే రూ. 1,09,40,868 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.34,31,490, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5,20,800, బ్రేక్ దర్శనం ద్వారా రూ.10,85,400, వీఐపీ దర్శనం ద్వారా రూ.23,85,000, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.8,00,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.2,9,096, కల్యాణకట్ట ద్వారా రూ.1,91,900తో పాటు ఆలయంలోని తదితర శాఖలు, పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుండి ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న ఏపీ మంత్రి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పి.విశ్వరూప్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి విశ్వరూప్‌కు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
యాదాద్రిలో భక్తుల కష్టాలు..
కార్తీకమాసం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి తరలివచ్చిన భక్తులకు కష్టాలు తప్పలేదు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో బస్సులు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. పిల్లాపాపలు, వృద్ధులతో వచ్చిన భక్తులు బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో ఎదుట బస్సులను కోసం ప్రయాణికులు నిరీక్షించారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులు వేయకపోవడంపై ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై మండిపడ్డారు.