సూపర్ హిట్ చిత్రాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో స్టార్‌డమ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అతని తాజా సినిమా కింగ్‌డమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మే 30న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇక్కడి సినిమాలకు ఆదరణ పెరిగింది. ఒకప్పుడు ఈ చిత్రాలను పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు ఆ గుర్తింపు కోసం కష్టపడుతోంది. ఇదంతా కాలచక్రంలాంటింది. రానున్న రోజుల్లో పరిస్థితులు మారవచ్చు. బాలీవుడ్ ప్రస్తుతం సృజనాత్మకత లోటుతో బాధపడుతోంది.
ఈ లోటును పూరించేందుకు కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు అవసరం. ముంబయ్ నుంచి కాకుండా బయటి నుంచి వచ్చే దర్శకులను బాలీవుడ్ స్వీకరించినప్పుడు.. అక్కడ తప్పకుండా బ్లాక్ బస్టర్ సినిమాలు మొదలవుతాయి. మంచి ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు కల్పిస్తే హిందీ సినిమా పరిశ్రమ మళ్ళీ పురోగతిని సాధించగలదు”అని అన్నారు. ఇక రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించి ఎంతో గొప్పగా తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారని విజయ్ దేవరకొండ తెలిపారు. ఇక్కడ ఇలాంటి గొప్ప సినిమా రూపొందుతుందని బాలీవుడ్ వాళ్లు ఊహించలేకపోయారని చెప్పారు. అయితే హిందీ చిత్ర పరిశ్రమ కూడా తమ దారులను కనుగొని, ఉన్నతంగా ముందుకు సాగుతుందని నమ్ముతున్నానని విజయ్‌దేవరకొండ పేర్కొన్నారు.