గౌహతి : పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా అసోంలో వరదలు పోటెత్తుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం తెలిపారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో నల్బరి, కర్బి అంగ్లాంగ్, దిమాహసావో , టిన్‌సుకియా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కేంద్రంతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా తనకు ఫోన్ చేసి వరద పరిస్థితిని తెలుసుకున్నారని సిఎం చెప్పారు. వరదల పరిస్థితిని ఎదుర్కోడానికి అన్ని విధాలా సాయంగా ఉంటామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇతర భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. బ్రహ్మపుత్ర, బరాక్ లోయలు సహా మొత్తం 14 జిల్లాల్లో 2,70,628 మంది వరదల కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అధికారులు వివరించారు. ఇప్పటివరకు 14 జిల్లాల్లోని 698 గ్రామాలపై వరద ప్రభావం పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి ఎన్డీర్‌ఎఫ్ బలగాలు రంగం లోకి దిగాయి.