Tuesday, December 17, 2024

ఉప్పొంగిన ఉప నదులు

- Advertisement -
- Advertisement -

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

భద్రాచలం వద్ద 45అడుగులకు చేరిన నీటి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష సహాయక చర్యలపై అధికారులకు అదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఏకమైన ప్రహహిస్తున్నాయి. కడెం ,మానేరు , మంజీరా, ప్రాణహిత తదితర ఉపనదులు ఉప్పొంగటంతో గోదావరినది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకే నీటిమట్టం 43అడుగులకు చేరటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రానికి 45అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద నదిలో నీటి ప్రవా హం 10.18లక్షల క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటిమట్టం మరిం త పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశా రు. ఎప్పటికప్పుడు వరద పరిస్థిలను సమీక్షిస్తున్నారు. ఎగువన శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 183500క్యూస్కెక్కుల నీ రు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు తెరిచి 208078క్యూసెక్కు ల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోంది.

ఎగువ నుంచి 44147క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు తెరిచి 41281 క్యూసెక్కుల నీటిని దిగువన గోదవరిలోకి వదిలిపెడుతున్నారు. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 62000క్యూసెక్కులు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి 100800క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. లోయర్ మానేరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 44147క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా , 41281క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఉపనదుల కలయికతో గోదావరిలో వరద ప్ర వాహం భారీగా పెరుగుతూ వస్తోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 513318క్యూసెక్కుల నీరు చేరుతుండగా, గేట్లు తెరిచి 660624క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నా రు. ప్రాణహిత నదికూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోం ది. మేడిగడ్డ వద్ద గోదావరిలో 812720క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ 85గేట్లను ఎత్తివేశారు. అన్నారం బ్యారేజీకి 7.90లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 66గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులు తున్నారు. పార్వతి బ్యారేజీ 60గేట్లు ఎత్తివేశారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో అధికారులను అప్రమత్తం చే యాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఆదేశాలిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. నదికి ఇరువైపు లా ప్రజలను అప్రమత్తం చేయాలని హెచ్చిరించారు. వరద సహాయక చర్యలు చేపట్టి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలమేరకు అధికారులు యుద్ద ప్రాతిపదికన వరద సహాయక చర్యల్లోకి దిగిపోయారు. భద్రాచలం జిల్లా కలెక్టరేట్ , భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్‌రూం లను ప్రారంభించారు. హైదరాబాద్ సచివాయలంలో కూడా సీఎం ఆదేశాలమేరకు కంట్రోల రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

మన తెలంగాణ / భద్రాచలం ః ఈ ఏడాది వరుసగా 3వ సారి గోదావరికి వరద వచ్చింది. జూలై నెలలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఏజన్సీని అతలాకుతలం చేసింది. భద్రాచలం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు తీవ్ర నష్టం జరిగింది. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. భారీగా పంట నష్టం సంభవించింది. ఆగస్టు నెలలో మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద వచ్చింది. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంబించింది. పరిస్థితి కుదుటపడుతుండగా మళ్లీ మూడవ సారి గోదావరికి వరద రావడంతో ఏజన్సీవాసులు ఆందోళన చెందుతున్నారు. వస్తున్న భారీ వరదనీటి కారణంగా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భదాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. జిల్లా యంత్రాగం అప్రమత్తం చేశారు.ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను బట్టి అర్ధరాత్రికి రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. అధికారులు వరద పరిస్థితి, సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. వరద పెరిగితే ప్రజలను పునరావాస కేంద్రాల్లోకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రమాదాలు సంభవిస్తాయని కలెక్టర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News