శ్రీశైలానికి పోటెత్తిన వరద ..
భారీగా సాగర్‌కు నీటివిడుదల
మనతెలంగాణ/హైరాబాద్: కృష్ణానది పరివాహకంగా ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. కృష్ణానదికి ప్రధాన ఉపనదులుగా ఉన్న మలప్రభ, ఘటప్రభ, దూద్‌గంగా, తుంగ, భధ్ర తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ వరదనీటితో పరవళ్లు తొక్కి ప్రవహిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టంతో తొణుకులు కొడుతొంది. ఎగువ నుంచి 1.43లక్షల క్యూసెక్కుల వస్తుండగా తుంగభద్ర ప్రాజెక్టులోని మొత్తం 33గేట్లు ఎత్తివేశారు.వచ్చిననీటిని వచ్చినట్టుగానే దిగువన నదిలోకి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నది తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విజయ నగర,బళ్లారి, కొప్పళ ,రాయచూరు జిల్లాలలతోపాటు తెలంగాణలో మహబూబ్ నగర్ , ఏపిలో కర్నూలు జిల్లాల అధికారులకు తుంగభద్ర బోర్డు నుంచి వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
శ్రీశైలంకు పోటెత్తినవరద:
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. నారాయణ పూర్ గేట్లు తెరిచి ఎగువ నుంచి వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువకు వదులు తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.20లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు 38గేట్లు తెరిచి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టులో వదర ఉధృతి పెరిగింది.సుంకేసుల బ్యారేజి 27గేట్లు తెరిచి 1.56లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.77లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు 10గేట్లు తెరిచి 3.40లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ గేట్లు ఎత్తివేత:
శ్రీశైలం ప్రాజెక్టునుంచి భారీగా వరదనీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి 590అడుగుల నీటిమట్టానికిగాను 580అడుగులకు చేరింది. ఎగువ నుంచి 3లక్షల క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరుకుంటోంది. సాగర్‌లో నీటిమట్టం 589అడుగులకు చేరితే ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదనీటిని దృష్టిలో ఉంచుకుంటే గురువారం నాటికే ప్రాజెక్టులో నీటిమట్టం 589అడుగుల స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో వరదనీటి నియంత్రణ చర్యల కింద సాగర్ గేట్ల ఎత్తివేతకు అవసరమైన అన్ని చర్యలతో సిద్దగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ 312టిఎంసీలు కాగా, ఈరోజే 295టిఎంసీలకు చేరుకుంది.
Huge Flood Water Inflow into Srisailam Project