Sunday, December 22, 2024

భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

- Advertisement -
- Advertisement -

Huge flood water inflow to Srisailam Project

కుండపోత వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
ప్రకాశం బ్యారేజి వద్ద ప్రమాద హెచ్చరిక
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
మనతెలంగాణ/మనతెలంగాణ: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ప్రాంతాలతోపాటు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కరుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతూ వస్తోంది. కృష్ణాకు ప్రధాన ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, హగరి, వేదవతి, భీమా తదితర ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిపై ఉన్న ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ పులిచింతల తదితర ప్రధాన ప్రాజెక్టులన్ని ఇప్పటికే గరిష్టస్థాయి నీటిమట్టాలతో నిండు కుండలను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం శ్రీశైల ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ఎగువ నుంచి జారాల ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టులోకి 2.67లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా , ప్రాజెక్టు గేట్లు తెరిచి స్పిల్‌వే ద్వారా 2.42లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్‌ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తి అనంతరం మరో 26429క్యూసెక్కుల నీరు నదిలో కలుస్తోంది. అటు తుంగభద్ర కూడా వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నీటితో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి మరింత పెరిగింది. ఎగువ నుంచి జలాశయంలోకి 4,31,640క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు గేట్లు తెరిచి స్పిల్‌వే మీదుగా 3,77,324క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కుడి, ఎడమ గట్ల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 66982క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలిపెడుతున్నారు. ప్రధాన కాలువలకు 4000క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 3.96లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు గేట్లు తెరిచి 372324క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.విద్యుత్ ఉత్పతి కేంద్రం ద్వారా 32525క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువలకు 15250క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4.28లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు గేట్లు తెరిచి స్పిల్ వే మీదుగా 4.21లక్షల క్యూసెక్కులు, పవర్‌హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజి దిగువన వరద హెచ్చరికలు
ప్రకాశం బ్యారేజికి భారీగా వరదనీరు చేరుతోంది. ఎగువ నుంచి 4.55లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అన్ని గేట్లు ఎత్తివేసి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.నదీతర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్చరించారు.లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులకు అదేశాలిచ్చారు. మచిలిపట్నం, ఉయ్యూరు కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ రంజిత్‌బాషా పేర్కొన్నారు.
గోదావరిలో పెరిగిన వరద:
గోదావరినదిలో కూడా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,17,828క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు గేట్లు తెరిచి స్పిల్‌వే మీదుగా 1,02,918క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పవర్‌హౌస్ ద్వారా మరో 4వేలక్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువలకు 10425క్యూసెక్కుల నీటిని వదులు తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,04,473క్యూసెక్కుల నీరు చేరుతుండగా, స్పిల్‌వే ద్వారా 99276 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంజీరా నదిలో కూడా వరద ప్రవాహం పెరిగింది. సింగూరు ప్రాజెక్టులోకి 23407క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు తెరిచి 26465క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 33598క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు తెరిచి 34033క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Huge flood water inflow to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News