ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలుపై పలు ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం
హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల్లో భాగంగా, వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహాలకు అనుకూల విధానాలు ఉండేలా ప్రస్తుత నిబంధనల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకై బిజినెస్ రిఫారమ్స్ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సిఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా తెలంగాణా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో (టాప్ అఛీవర్స్) నిలిపినందుకు ప్రభుత్వంలోని పలు శాఖలను సోమేశ్‌కుమార్ అభినందించారు.
మెరుగైన సమాచార మార్పిడి, పారదర్శకతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు తమ శాఖల పనితీరులో సామర్థ్యాన్ని పెంపొందించుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని సిఎస్ కోరారు. ఈఓడిబి సంస్కరణల అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున, ఫలితాల ఆధారితంగా పూర్తి చేసేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను కోరారు. ప్రస్తుత బిఆర్‌ఎపి (బిజినెస్ రూల్స్ యాక్షన్ ప్లాన్ ) ఈఓడిబికి సంబంధించి 540 సంస్కరణలు అమలు చేస్తున్నట్టు సిఎస్ వెల్లడించారు. సమావేశంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.