హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షడు కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో తెలంగాణ ఆడబిడ్డకు తీరని అన్యాయం చేశారని ఆయన అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు గోవిందా అని అర్ధమైందని పేర్కొన్నారు. ఏడాది దాటిన ఉద్యోగాల ఊసే లేదని.. బిఆర్‌ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని తెలిపారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2వేలు, రూ.4వేలు పెన్షన్లు ఇస్తామన్న పాతరేశారని మండిపడ్డారు. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయిందని గుర్తు చేశారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయితే.. ఊసరవెల్లి ముదిరి రేవంత్ రెడ్డి అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అందమే సక్కగా లేదు కానీ.. అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. రంకెలు కాదు రేవంత్ రెడ్డి.. అంకెలు ఎక్కడ పోయినాయి అని ప్రశ్నించారు. ఆకాశం నుంచి బడ్జెట్ పాతాళానికి పడిపోతుందని.. పాలన చేతకాని ప్రభుత్వం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.