కాంగ్రెస్‌లో భారీగా ఆశావహుల జాబితా
కార్పొరేషన్ చైర్మన్, రాజ్యసభ ఎంపి, ఎంఎల్‌సిలుగా అవకాశం ఇవ్వాలని పలువురి విజ్ఞప్తి
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాబితాను సిద్ధం చేస్తున్న సిఎం రేవంత్
మనతెలంగాణ/ హైదరాబాద్ : కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పోస్టులన్నీ రద్దవ్వటంతో వాటికోసం కాంగ్రెస్ ఆశావహులు తీవ్ర పోటీపడుతున్నారు. ఈ పదవితో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పదవుల కోసం పలువురు కాంగ్రెస్ నా యకులు బారులు తీరుతున్నారు. టికెట్లు త్యాగం చేసిన వారితో పాటు, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్క ని వారికి పదవులు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఇప్పుడు వారికి సర్దుబాటు చేయా ల్సి ఉండడంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారి జాబితాను సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే పలువురు ఆశావహులు సిఎం రేవంత్‌ను, అధిష్టానాన్ని కలిసి తమకు పదవులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గెలుపు కోసం కృషి చేసిన వారు… టికెట్లు త్యాగం చేసిన వారు
ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవితో పాటు, పార్టీ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల సీట్ల కోసం నాయకుల జాబితా చాంతాడంత ఉంది. ఇందులో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసిన నేతలతో పాటు, టికెట్లు త్యాగం చేసిన నాయకులు కూడా పదవులను ఆశిస్తుండ డం గమనార్హం. ఇప్పటికిప్పుడు రెండు గవర్నర్ కో టా ఎమ్మెల్సీలు, మరొకటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. సిపిఐతో పొత్తు పెట్టుకున్న సమయంలో ఒక టికెట్‌తో పాటు, ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆ పార్టీ కి ఒక సీటు ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా టికెట్లు అడగకుండా పార్టీ కోసం పని చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, సురేశ్ షెట్కార్, ఇరావత్రి అనిల్ కుమార్, పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌లు మొదటి జాబితాలో ఉన్నట్టుగా తెలిసింది. వీరితో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డిలు కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ లాంటి వాళ్లు మాత్రం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని, పార్టీ ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని పేర్కొంటున్నారు. ఇక డిసిసి మాజీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పిసిసి అధికార ప్రతినిధుల్లో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్ యాదవ్, భవానిరెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం విజయశాంతి, చిన్నారెడ్డి తదితరులు సైతం తమకు అర్హత కలిగిన పదవిని కట్టబెట్టాలని కోరుతున్నారు.
పిసిసి పదవి కోసం పలువురు
ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి కూడా ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ పదవి సిఎం వద్దనే ఉంచుకోవాలని పార్టీ అధిష్టానంం సూచించినట్లుగా తెలుస్తోంది. అయి తే ఈ పదవి కోసం మాజీ ఎంపి, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్‌లు పోటీ పడుతున్నారు. మరో వైపు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ పోస్టుల కోసం కూడా, ఇప్పటి నుంచే పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మూడు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేతలు జీవన్ రెడ్డి (జగిత్యాల), ఫిరోజ్ ఖాన్ (నాంపల్లి), జగ్గారెడ్డి (సంగారెడ్డి), మధుయాష్కీ (ఎల్బీనగర్), అంజన్‌కుమార్ యాదవ్ ( ముషీరాబాద్) తదితరులు ఓటమి పాలయ్యారు. వీరిలో జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా మిగతా ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రి పదవులు కట్టబెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు మూడు ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. ఈ మూడు ఎవరికి ఇస్తారు, ఎవరు మంత్రులవుతారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది.
అనుబంధ సంఘాల నాయకులకు కచ్చితంగా
ప్రస్తుతం రానుంది ఎన్నికల సీజన్ కావడంతో ఆశావహులకు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో నాలుగైదు నెలల్లో ఎంపి ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిన సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేయడానికి అక్కడి నేతలకు నామినేటెడ్ పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహారించిన అనుబంధ సంఘాలు మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఫిషర్ మెన్ కమిటీ, కిసాన్ సెల్, మైనార్టీ సెల్ తదితర అనుబంధ సంఘాల నాయకులకు పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.