చాంద్రాయణగుట్ట : వచ్చే జంట పండగలకు శాంతిభద్రతల సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు దక్షిణ మండల డీసీపీ పి.సాయి చైతన్య తెలిపారు. బక్రీద్ పండగ, తొలి ఏకాదశి ఈనెల 29వ తేదీ గురువారం కలిసి రావటంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఒకరి పండగలను ఒకరు గౌరవించుకుంటూ కలిసిమెలసి ఉండాలన్నారు. ఆదివారం ఫలక్‌నుమా పోలీసు కాంప్లెక్స్‌లో మీడియాతో మాట్లాడుతూ బక్రీదు కోసం సక్రమమైన జంతువులను మాత్రమే ఉపయోగించాలని, అందుకు విరుద్ధంగా జంతువులను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇతర కమిషనరేట్ల సరిహద్దులో 23, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 70 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మూడు వందల మంది పోలీసులు, తొమ్మిది ప్లాటూన్ల బలగాలను బందోబస్తుకు వినియోగిస్తామన్నారు. బక్రీదు రోజు ఇంటింటికి జంతు వ్యర్థాలను పారవేసే ఫాలిథిన్ కవర్లను అందజేస్తారని, ఆ చెత్త కవర్లను ఇంటి ముందుకు, బస్తీకి వచ్చే బల్దియా ప్రత్యేక వాహనాలకు మాత్రమే ఇవ్వాలన్నారు. జంతు సంరక్షణ కోసం కాటేదాన్ తదితర ప్రాంతాలలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను, పశువైద్యులను ఏర్పాటు చేశారన్నారు. మీరాలం ఈద్గా వద్ద 30వేల మంది భక్తులు ప్రార్థనలు చేసే అవకాశం ఉందని, వర్షాకాలం కావటంతో ప్రార్థనలకు ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వక్ఫ్‌బోర్డుకు లేఖ రాసినట్లు వివరించారు.