Tuesday, September 17, 2024

స్వీపర్ లైంగిక వేధింపులు.. బద్లాపూర్ భగ్గు

- Advertisement -
- Advertisement -

థానే జిల్లా స్కూల్‌లో నర్సరీ చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపులు
స్థానికుల ఆగ్రహం..రైల్వేస్టేషన్‌లో ఏడుగంటలకుపైగా బైఠాయింపు
నిందితుడిని ఉరి తీయాలని నినాదాలు ప్రభుత్వ పెద్దల హామీని
లెక్కచేయని ఆందోళనకారులు లాఠీచార్జితో చెదరగొట్టిన పోలీసులు

ముంబయి : ఒక పాఠశాల వాష్‌రూమ్‌లో స్వీపర్ నాలుగు సంవత్సరాల బాలికలు ఇద్దరిపై లైంగిక అత్యాచారం ఆరోపణ నేపథ్యంలో వేలాది మంది నిరసనకారులు మంగళవారం ఠాణె జిల్లా బడ్లాపూర్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలను ఆక్రమించుకున్నారు. నిరసనకారులు స్థానిక పాఠశాల భవనాన్ని ముట్టడించారు. రైలు పట్టాలను ఆక్రమించుకుని పోలీస్ సిబ్బందిపై రాళ్లు రువ్విన నిరసనకారులపై పోలీసులు కేన్‌చార్జి చేశారు. ఆగ్రహోదగ్రులైన తల్లిదండ్రులతో సహా వందలాది మంది నిరసనకారులు లైంగిక అత్యాచారంపై తమ అసంతుష్టి వ్యక్తం చేయడానికి పాఠశాల భవనంలో విధ్వంసం సృష్టించారు.

కాగా, సీనియర్ ఐపిఎస్ అధికారి ఆర్తీ సింగ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు తాను ఆదేశించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోమ్ శాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. పాఠశాలపై చర్య తీసుకోగలమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ దర్యాప్తు జరిపిస్తామని, దోషులను వదలబోమని షిండే తెలియజేశారు. బద్లాపూర్ స్టేషన్‌లో ఆగ్రహోదగ్రులైన నిరసనకారులు పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా ‘హై, హై’ నినాదాలు చేయడం కనిపించింది.

లైంగిక అత్యాచారానికి పాల్పడినట్లు భావిస్తున్న స్వీపర్‌కు మరణ శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ‘విశాఖ కమిటీలు’ ఏర్పాటు చేయనున్నట్లు, తమ ఆవరణల్లో సిసిటివి కెమెరాలు పని చేయడం లేదని తేలితే ఆ పాఠశాలలపై చర్య తీసుకోనున్నట్లు మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. విద్యార్థినులు, ముఖ్యంగా 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీల్లోనివారి సమస్యల వ్యక్తీకరణకు ఆ బృందాలు ఒక వేదిక ఏర్పాటు చేస్తాయని ఆయన చెప్పారు. బద్లాపూర్ పాఠశాలకు ఒక నోటీస్ జారీ చేసినట్లు, పాఠశాల ప్రిన్సిపాల్‌ను, కొద్ది మంది టీచర్లను, ఇద్దరు అసిస్టెంట్లను సస్పెండ్ చేసినట్లు కేసర్కర్ వెల్లడించారు. బద్లాపూర్ రైల్వేస్టేషన్‌లో నిరసన రోజు అంతా సాగింది. రైళ్లు నడవడాన్ని అనుమతించాలన్న అధికారుల విజ్ఞప్తులను పలువురు మహిళలతో సహా జనం ఖాతరు చేయలేదు.

మధ్యాహ్నం నిరసనకారులను శాంతింపచేసేందుకు రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ప్రయత్నించారు. బాధితులకు న్యాయం, అరెస్టయిన నిందితునిక మరణ శిక్ష కోరుతూ వారు నినాదాలు చేశారు. కాగా, బద్లాపూర్ రైల్వే స్టేషన్‌ల నిరసన రాజకీయ ప్రేరేపితమైనదని ఠాణె జిల్లా ముర్బాద్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి ఎంఎల్‌ఎ కిసన్ కాఠోరె ఆరోపించారు. ఆందోళనకారులు పొరుగు ప్రాంతాలవారని, బద్లాపూర్ వాసితులు కారని కూడా ఆయన ఆరోపించారు. బాధిత బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడానికి ముందు బారిని బద్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో 11 గంటల పాటు వేచి ఉండేలా చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News