Friday, November 22, 2024

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు

- Advertisement -
- Advertisement -

Huge provision for Ganesh immersion in Hyderabad

27వేల మంది పోలీసులతో భద్రత
ఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నిఘా
జియో ట్యాగింగ్‌తో విగ్రహాల నిమజ్జనం
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల గురించి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ప్రధాన నిమజ్జన ర్యాలీ కేశవగిరి నుంచి ట్యాంక్‌బండ్ వరకు కొనసాగనున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ఆర్‌పి రోడ్డు, ఎంజి రోడ్డు నుంచి రావాలని తెలిపారు. ఈస్ట్‌జోన్ ఉప్పల్ నుంచి వచ్చే విగ్రహాలు రామంతాపూర్ నుంచి అడిక్‌మేట్ మీదుగా ఫీవర్ ఆస్పత్రి నుంచి ఫీవర్ ఆస్పత్రి, విద్యానగర్ నుంచా రావాలని అన్నారు. ఇప్పటి వరకు నగరంలో 2.5లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందులో చాలా విగ్రహాలు ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నారని అన్నారు. 27వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

బందోబస్తు విధుల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు ఉంటారని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించామని చెప్పారు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల నిమజ్జనం నిర్వహించనున్నట్లు తెలిపారు. విగ్రహాలను తరలించే వాహనాలకు బ్లూ, ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్లు కేటాయించామని, కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు అతి పెద్ద రూట్ ఉందని, 17 కిలోమీటర్లు నిమజ్జన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ర్యాలీ బందోబస్తుకు రూఫ్‌టాప్ సెక్యూరిటీని ఏర్పాటు చేశామని, వారు బైనాక్యులర్స్ ద్వారా భద్రతను పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. 475 వైర్‌లెస్ సెట్లను పోలీసులకు అందజేశామని తెలిపారు.

వినాయకుడి విగ్రహాలకు జియో ట్యాగింగ్‌తోపాటు క్యూఆర్ కోడ్, బార్ కోడింగ్ ఇచ్చామని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా 8,100 విగ్రహాలు అనుమతి తీసుకున్నారని, ఇంకా నగరంలో 42 నుంచి 45,000 వరకు విగ్రహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రత కోసం 24 బాంబ్ స్కాడ్‌ను ఏర్పాటు చేశామని, స్పెషల్ టీములను ఏర్పాటు చేశామని అన్నారు. మహిళల భద్రత కోసం నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్ పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహాన్ని క్రేన్ నంబర్ 4వద్ద నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం 55 స్టాటిక్ క్రేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ముందుగానే బడాగణేష్ నిమజ్జనం చేయనున్నట్లు స్పష్టం చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్ తదితర ప్రాంతాల్లో నిఘా పెట్టామన్నారు. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9490598985, ఫేస్‌బుక్, ట్విటర్, ఎఫ్‌ఎం రేడియో ద్వారా అనౌన్స్‌మెంట్ చేయనున్నట్లు చెప్పారు.

పార్కింగ్ ప్రాంతాలు…

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఖైరతాబాద్ జంక్షన్, ఎంఎంటిఎస్ స్టేషన్ ఖైరతాబాద్, ఆనంద్‌నగర్ కాలనీ, బైక్‌సైడ్ ఆఫ్ బుద్ద భవన్, గోసేవ సదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టిఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్‌లో నిమజ్జనం కోసం వచ్చిన వారు వాహనాలను పార్కింగ్ చేయాలి.

నిమజ్జనం తర్వాత వెళ్లాల్సిన మార్గం…

వినాయకుడి నిమజ్జనం తర్వాత లారీలు, ట్రక్కులు ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వివి స్టాట్యూ, కెసిపి మీదుగా వెళ్లాలి. తెలుగుతల్లి స్టాట్యూ లేదా మింట్ కంపౌండ్ రోడ్డు వైపు అనుమతించరు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి చిల్డ్రన్స్ పార్క్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ లేదా ఇందిరాపార్క్, అశోక్‌నగర్, విద్యానగర్ వెళ్లాలి, బైబిక్ హౌస్, రైల్ ఓవర్ బ్రిడ్జి వైపు లారీలను అనుమతించరు.

ట్రాఫిక్ ఆంక్షలు…

వినాయకుడి విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోకి వచ్చే అంతరాష్ట్ర, జిల్లాలకు చెందిన లారీలపై నిషేధం విధించారు. ఆర్టిసీ బస్సులను పలు ప్రాంతాల్లో దారి మళ్లించారు. బాలాపూర్‌న ఉంచి ట్యాంక్‌బండ్‌కు నిమజ్జన ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలతోపాటు, బస్సులను దారి మళ్లించారు. విమానశ్రయం, రైల్వే స్టేషన్‌నకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. వాహనదారులు దారి మళ్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకునేందుకు 04027852482, 9490598985,9010303626కు ఫోన్ చేయాలని కోరారు. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

బాలాపూర్ నుంచి వచ్చే శోభాయాత్ర ఫలక్‌నుమా నుంచి చారిర్మనార్, అఫ్జల్‌గంజ్, గౌలీగూడ చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపు విగ్రహాలు తరలనున్నాయి. బేగంబజార్, ఉస్మాన్ గంజ్, అఫ్జల్‌గంజ్,గౌలిగూడ మీదుగా శోభాయాత్ర వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీరోడ్, కర్బాల మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్‌నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్‌టిఆర్ మార్గ్ వైపు విగ్రహాల మళ్లించారు.

ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్‌పేట కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగనుంది. దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా కొనసాగనుంది. టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వెళ్లాలి. మెహిదిపట్నం, టపాచపుత్ర, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సీతారాంబాగ్, బోయగూడ కమాన్, గోశామహల్ బారదారి, ఎంజే మార్కెట్ మీదుగా వెళ్లాలి. ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్ నుంచి వచ్చే శోభాయాత్ర అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనుంది.

ఆర్టిసీ బస్సులు…

నగరంలోని ఆర్టిసి బస్సులను మాసబ్ ట్యాంక్, వివి స్టాట్యూ, సిటిఓ ప్లాజా, ఎస్‌బిహెచ్ కాలనీ టవర్, చిలకలగూడ ఎక్స్ రోడ్డు, రామంతాపూర్ టివి స్టేషన్, గడ్డిఅన్నారం, చాదర్‌ఘాట్, దానమ్మ హట్స్, ఎల్‌ఎస్ సదన్, వైఎంసిఏ నారాయణగూడ, తార్నాకవైపు అనుమతించరు. అంతరాష్ట్ర, జిల్లా బస్సులను ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నగరంలోకి అనుమతిలేదు. ప్రైవేట్ బస్సులు నగరం బయటి నుంచి మాత్రమే నడిపించుకోవాలి.

సైబరాబాద్‌లో…

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మూడు రోజులు వినాయకుడి నిమజ్జనం నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ జోన్లలో 8,434 విగ్రహాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 35 చెరువుల్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి 6,500మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మాదాపూర్ జోన్‌లో 2,001, బాలానగర్ జోన్‌లో 3,379, శంషాబాద్ జోన్‌లో 3,054 విగ్రహాలకు ఏర్పాటు చేశారు. పెద్ద విగ్రహాలు 1,054లను ఐడిఎల్ ట్యాంక్, కూకట్‌పల్లి చెరువులో నిమజ్జనం చేయనున్నారు. 620 విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

డ్రోన్లకు నిమజ్జనం సమయంలో అనుమతి లేదు. నిమజ్జనంలో పాల్గొనే వారు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు కోరారు. పిల్లలకు మొబైల్ నంబర్ రాసిన చిట్టీ ఇవ్వాలని, వారు తప్పిపోయినప్పుడు సాయపడుతుందని తెలిపారు. సిసిటివిలను నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దు, వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేయవద్దని హెచ్చరించారు. వాహనాలను నిర్ణీత ప్రాంతంలో పార్కింగ్ చేయాలని చెప్పారు. అత్యవసరంలో ఉపయోగపడే విధంగా పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు తమ వద్ద ఉంచుకోవాలని కోరారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్ విధుల్లో ఉంటారని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ 9493622395కు ఫోన్ చేయాలని కోరారు. అత్యవసర సమయంలో డయల్ 100, 9490617444కు ఫోన్ చేయాలని అన్నారు.

రాచకొండలో…

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సిపి మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీ నుంచి 20వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. సరూర్‌నగర్ ట్యాంక్, సఫిల్‌గూడ ట్యాంక్, కాప్రా చెరువులో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News