Sunday, November 17, 2024

హైదరాబాద్ లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం, భారీగా ట్రాఫిక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు ఒక గంటపాటు కురిసిన వాన నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. కాలనీలు అంధకారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా వానపడితే.. మరికొన్ని ప్రాంతాల్లో 6, 8, 10 సెం.మీ.లు వర్షం కురిసింది. దీంతో గత కొంత కాలంగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రేటర్ ప్రజలు ఈ వర్షంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.

నగరంలో కుండపోత వర్షంతో పలు ప్రదేశాల్లోని రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రధాన రోడ్లలో, కాలనీల్లో సైతం కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్య, బలమైన ఈదురుగాలు వంటివి చోటుచేసుకున్నవి. రోడ్లపైన, కాలనీల్లోనూ విరిగిపడిన చెట్ల కొమ్మలు, డ్రైనేజీ పొంగిపొర్లాయి. మియాపూర్ లో అత్యధికంగా 10 సెం.మీ.లు, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 8 సెం.మీ.లు, కూకట్‌పల్లిలో 7 సెం.మీలు వర్షం కురిసినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లోని రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు బారులుతీరాయి. ఐటి కారిడార్‌లో వాహనాలు భారీ వర్షంతో ట్రాఫిక్ సమస్యకు గురయ్యాయి.

జిహెచ్‌ఎంసి కమిషనర్ సమీక్ష
నగరంలో.. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని జిహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై నిలిచిపోయిన నీటితో వాహనదారులు ఙబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా అధికారులతో సమావేశమైన జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ .. పరిస్థితులపై సమీక్షించారు. ఇంజనీరింగ్ అధికారులందరూ తమతమ ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించాలని కమిషనర్ ఆదేశించారు. జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూమ్‌కు వచ్చే సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలని కమిషనర్ ఆదేశించారు. సిటిజన్స్ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే జిహెచ్‌ఎంసి కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించారు.

మెట్రో రైళ్లకు అంతరాయం
గ్రేటర్‌లో కురిసిన భారీ వర్షానికి మంగళవారం మెట్రో సేవలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మెట్రో స్టేషన్‌లలో ప్రయాణికులు భారీగా నిలిచిపోయారు. భారీగా కురిసిన వర్షానికి రోడ్లపై ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణికులు భారీగా మెట్రో స్టేషన్‌లకు చేరుకున్నారు. దీంతో అన్ని మెట్రో స్టేషన్‌లు ప్రయాణికులతో నిండిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోవడంతో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. ప్రధానంగా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో నగరం జలమయమైంది. మియాపూర్ నుంచి ఎల్‌బి నగర్ వరకు నగరం చుట్టూ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే రోడ్లపై నీరు నిలిచింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతోపాటు మెట్రో స్టేషన్లలో కూడా నీరు రావడంతో దాదాపు మూడు గంటల పాటు మెట్రో సర్వీసులను అధికారులను నిలిపివేశారు. దీంతోపాటు ఎస్కలేటర్‌లను, లిఫ్ట్‌లను మెట్రో అధికారులు ఆపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News