ముంబైలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వానతో ముంబై అతలాకుతలం అయ్యింది. బుధవారం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వర్షం దంచికొట్టింది. ఈ నేపత్యంలో గురువారం పుణె, ముంబైలోని విద్యాసంస్థలకు సెలవు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. రోడ్లు రహదారులు జలయమయ్యాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
భారీ వర్షాల కారణంగా ముంబ్రా బైపాస్ వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు జామ్ అయ్యింది. అగ్నిమాపక అధికారి స్వప్నిల్ సర్నోబత్ మాట్లాడుతూ.. దాదాపు 3 గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ఈ సమయంలో ట్రాఫిక్ విభాగం కూడా ట్రాఫిక్‌ను ఒకవైపు నుంచి నియంత్రించిందని, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని.. రోడ్డుపై రాళ్లను జేసీబీతో తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసినట్లు తెలిపారు. ఇక, పలు చోట్ల రైలు పట్టాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో సబర్బన్ రైళ్లను నిలిపివేశారు. అలాగే, పలు విమానాల దారి మళ్లించారు. రానున్న మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబైకి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.