ఆరు రోజుల్లో 85వేల మందికి కొనుగోలు
గతేడాదికంటే ఈసారి ఆఫర్ వైపు ప్రయాణికులు మొగ్గు
చమురు ధరలతో మెట్రో వైపు వెళ్లుతున్న వాహనదారులు
20ట్రిప్పులకు కొనుగోలు చేస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులకు అవకాశం
హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో ప్రతినిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్దానాలకు చేరవేస్తుంది. ఇటీవల మెట్రో రైల్ ప్రవేశ పెట్టిన సువర్ ఆఫర్‌కు భారీ స్పందన వస్తున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించడంతో ఆశించిన స్దాయికంటే ఆరు రోజుల్లో 85వేలు మందికి కార్డులు కొనుగోలు చేసినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో ప్రవేశ పెట్టిన ఆఫర్ కంటే ఈసారి ఎక్కువ మంది మొగ్గు చూపుతారని, సుమారు మరో లక్షల వరకు ప్రయాణికులు ఆఫర్ కార్డులు తీసుకోవచ్చని మెట్రో సిబ్బంది భావిస్తున్నారు. చమురు ధరలు పెరగడంతో ద్విచక్ర వాహనదారులు తమ కార్యాలయాలకు మెట్రోపై వెళ్లుతున్నారని, వాహనాలను మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసి దర్జాగా రైల్లో ప్రయానిస్తున్నారని చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారితో నష్టాలు చవిచూసిన మెట్రో కొత్త పథకాలు తీసుకరావడంతో నగర ప్రజలు మెట్రో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
గత నెల నుంచి మెట్రో రైల్ సేవలు పొడిగించడంతో ప్రయాణీకులు సంఖ్య రోజుకు 1.50లక్షల వరకు చేరుగా, నూతన పథకాలతో మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజుకు 2.50లక్షల మంది చేరుకునేలా చేస్తామని, ప్రయాణికులు సులువుగా ఉండే విధానాలు తీసుకొస్తే తమ లక్షం చేరుకుంటామని వెల్లడిస్తున్నారు. సువర్ణ ఆఫర్ 15 జనవరి 2022వరకు ఉంటుందని ప్రయాణికులు కొనుగోలు చేసి మెట్రో సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నారు. మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణ అవసరాలకు తగినట్లుగా ఏదైనా ఫేర్‌తో 30 ట్రిప్పులను కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి 45 రోజుల పాటు తిరగవచ్చని మెట్రో స్మార్ట్ కార్డ్‌పై మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.
అదే విధంగా ఆకర్షనీయమైన బహుమతులను ప్రతి నెల గెలుచుకునే అవకాశం కల్పిస్తూ ప్రతి నెలా ఐదుగురు విజేతలను లక్కీడ్రా సిఎస్సీ కార్డు వినియోగదారుల నుంచి ఎంపిక చేస్తామని మెట్రో ఉన్నతాదికారులు వెల్లడిస్తున్నారు. వీరు ఓక్యాలెండర్ నెలలో కనీసం 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ సిఎస్సీ (కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డు)లను టీ సవారీ, మెట్రో స్టేషన్ల వద్ద నమోదు చేసుకోవాల్సి సూచిస్తున్నారు. అదే విధంగా కోవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని, స్టేషన్ల వద్ద మాస్కులు, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నట్లు, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరిస్తున్నారు.