ప్రకటించిన యజమానురాలు
రూ.30,000 ఇస్తానని ప్రకటన
మనతెలంగాణ, హైదరాబాద్ : గతంలో పెంపుడు కుక్క కన్పించడంలేదని చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి సారిగా ఓ జంతు ప్రేమికురాలు తన పెంపుడు పిల్లి తప్పిపోయిందని పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా జంతు ప్రేమికురాలు. చిన్నప్పటి నుంచి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుకుంటోంది. ఎనిమిది నెలల క్రితం అప్పుడే పుట్టిన జింజర్ అనే పిల్లిని పెంచుతోంది. అప్పటి నుంచి పిల్లిని గారాబంగా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్‌లోని పెట్ క్లినిక్ తీసుకుని వచ్చి జూన్17వ తేదీన ఆపరేషన్ చేయించింది.
కుట్లు వేసిన ప్రాంతంలో వాపు రావడంతో తిరిగి జూన్ 23వ తేదీన ఆస్పత్రికి మళ్లీ తీసుకుని వెళ్లింది. అక్కడ చికిత్స పొందుతున్న పిల్లి 24వ తేదీన తప్పిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది సెరీనాకు చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్షంపై ఆగ్రహించిన సెరీనా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో తానే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పిల్లి ఆచూకీ చెప్పిన వారికి రూ.30,000 ఇస్తానని, పిల్లి ఫొటో ముద్రించిన పాంప్లెట్‌ను పంచుతూ కన్నీరు పెట్టుకుంది. తన పిల్లి ఆచూకీ కోసం 20 రోజుల నుంచి తిరుగుతున్నా ఆచూకీ లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.