గోల్కొండ ఫోర్ట్ పరిసరాల్లో ఆంక్షలు
పాసులు ఉన్న వారికే అనుమతి
నగరంలోని అన్ని ప్రాంతాల్లో పటిష్ట నిఘా
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు ప్రశాంతంగా జరిగేందుకు నగర పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఘట్టి నిఘాను ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సిసికెమెరాలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనుమానస్పదంగా కన్పించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న గోల్కొండ ఫోర్ట్ పరిసరాలను ఇంటలీజెన్స్, నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేడుకలు నిర్వహించనున్న ప్రాంతాన్ని అనువణువు తనిఖీ చేస్తున్నారు.
వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వేడుకలకు హాజరయ్యే వారికి వివిధ రకాల పాస్‌లను జారీ చేశారు. వారికి కేటాయించిన ప్రాంతం నుంచి వారు వెళ్లాల్సి ఉంటుంది. సామాన్యులను కూడా వేడకుల్లో పాల్గొన వచ్చు కానీ వారిపై పలు ఆంక్షలు విధించారు. వాహనాలు రావడంతోపాటు వెళ్లాల్సిన దారిని కూడా నిర్ధేశించారు. దానికి విరుద్ధంగా ఎవరినీ అనుమతించరు. అలాగే నగరంలో గతంలో తీవ్రవాదులు పలు సంఘటనలకు పాల్పడడంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు, టిఎస్‌ఎస్‌పి పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికి పలు సూచనలు ఇస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతటా బందోబస్తు…
నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. గత మూడు రోజుల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్కాడ్ బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. పెట్రోలింగ్ టీములు ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వర్తిస్తున్నారు.